Share News

డోలీ మోతలు తప్పేలా..అంబులెన్స్‌లు వెళ్లేలా

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:24 AM

కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

డోలీ మోతలు తప్పేలా..అంబులెన్స్‌లు వెళ్లేలా

- ప్రతి గిరిజన గ్రామానికీ రోడ్డు

- 108 వాహనం వెళ్లే విధంగా నిర్మాణాలు

- జిల్లాలో మొదటి విడతగా 83 రహదారులకు నిధులు

పార్వతీపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా డోలీల మోత లేకుండా చేయడం.. ప్రతి గిరిజన గూడకూ అంబులెన్స్‌ వెళ్లేలా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంగా పని చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 83 రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. అవసరమైన చోట్ల కల్వర్టులు సైతం ఏర్పాటు చేయనుంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.200 కోట్లకు పైబడి నిధులతో గిరిజన గ్రామాలకు బీటీ రహదారులు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో పక్కా రోడ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, నిధులు పూర్తిస్థాయిలో మంజూరయ్యే వరకూ ఆయా గ్రామాలకు కనీసం అంబులెన్స్‌ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొమరాడ మండలంలో 13 రోడ్లు, కురుపాం మండలంలో 14, జియ్యమ్మవలసలో ఒకటి, గుమ్మలక్ష్మీపురంలో 23, సీతంపేటలో ఆరు, పార్వతీపురంలో ఐదు, మక్కువలో రెండు, సాలూరులో ఏడు, పాచిపెంట మండలంలో 12 రహదారులను నిర్మించనుంది. వీటికోసం రూ.27.85కోట్లు మంజూరు చేసింది. కొమరాడ మండలంలోని వనబడి-తేలేసుకు రహదారి, సీతంపేట మండలంలోని కొండాడ పంచాయతీ కొండారెడ్డి-బేధిమానుగూడ రోడ్డు, పార్వతీపురం మండలంలోని పాత బుదురువాడ-కొత్త బుధవారం వరకు రహదారితో పాటు కల్వర్టు నిర్మాణం జరగనుంది. మక్కువ మండలంలో సిరమానుగూడ, అలగురువు, చేలుగుండ రోడ్లు, సాలూరు మండలం సారిక పంచాయతీ కురుకూటి పాలివలస-సంగంవలస, పాచిపెంటలో ఎన్‌హెచ్‌ 26 నుంచి చంద్రవలసకు, కురుపాం మండలం చాపరాయిగూడ పంచాయతీలో అగులుగోడ నుంచి సాపరాయిగోడ వరకు, జియ్యమ్మవలసలో ఆంధ్రసింగి బీటీ నుంచి కోతాము వరకు, గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీలో బాలేరు జంక్షన్‌ నుంచి బాలేష్‌గోడ వరకు రహదారి నిర్మాణం జరగనుంది. రోడ్ల నిర్మాణంతో పాటు నీరు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో కల్వర్టులు కూడా కట్టనున్నారు.

గిరిజనుల అభివృద్ధే లక్ష్యం

గిరజనుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు బీటీ రోడ్లు నిర్మించాం. సాలూరు నియోజకవర్గంలో వంద రోజుల్లో వంద రహదారుల నిర్మాణాలు జరిగాయి. ప్రతి గిరిజన గ్రామానికీ అంబులెన్స్‌ వెళ్లే విధంగా రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశాం.

-గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి

ఆదేశాలు జారీ చేశాం..

గిరిజన గ్రామాలకు అంబులెన్స్‌లు వెళ్లే విధంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. వీటివల్ల గిరిజన ప్రజలకు డోలీ మోతలు తప్పనున్నాయి. దశలవారీగా అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

-ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌

Updated Date - Oct 24 , 2025 | 12:24 AM