Development ప్రగతి పరుగులు పెట్టాలని..
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:15 PM
Let Development Move at a Fast Pace నూతన ఏడాదిలో జిల్లా అభివృద్ధి పథంలో పయనిం చాలని.. మౌలిక వసతుల కల్పన, విద్య వైద్య రంగాల్లో ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆశిస్తు న్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించాలని ఆకాంక్షిస్తున్నారు.
మన్యం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్ష
పెండింగ్ పనులు పూర్తిచేయాలని విన్నపం
పార్వతీపురం, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): నూతన ఏడాదిలో జిల్లా అభివృద్ధి పథంలో పయనిం చాలని.. మౌలిక వసతుల కల్పన, విద్య వైద్య రంగాల్లో ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆశిస్తు న్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ‘పూర్వోదయ’ పథకం కింద మంజూరైన నిధులతో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ఆధునికీకరణ, జంఝావతి జలాశయం పెండింగ్ పనులను నూతన ఏడాదిలో పూర్తిచేసి.. సాగునీటి కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.
చేయాల్సిన పనులివీ..
జిల్లాకు పీపీపీ పద్ధతిలో మంజూరు చేసిన వైద్య కళాశాలల పనులకు శంకుస్థాపనతో పాటు నిర్మాణం త్వరి తగతిన చేపట్టాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. వైద్య విద్య చదివే విద్యార్థులకు స్థానికంగానే సీట్లు లభిస్తాయి. పార్వతీపురం, సీతంపేటలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుప త్రులతో పాటు సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఈ ఏడాది అందుబాటులోకి తేవాల్సి ఉంది. వాటి నిర్మాణం పూర్తయితే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయి. ఇకపోతే సీతానగరంలో వంతెన నిర్మాణం పూర్తయింది. కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలుగుతాయి. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు పూర్తి చేసి.. విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి తేవాల్సి ఉంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులు, గిరిజన, మైదాన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు, కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెన పనులను శరవేగంగా పూర్తిచేయాల్సి ఉంది.