Leave This Place ఇక్కడ నుంచి వెళ్లిపోండి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:41 PM
Leave This Place ఏవోబీ సరిహద్దు ప్రాంతం కొఠియాలో మరోసారి ఒడిశా అధికారులు రెచ్చిపోయారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు.
కొఠియాలో ఆంధ్రా కార్యక్రమాలు చేపట్టొద్దు
ఎగువమెండంగిలో ఏపీ సిబ్బంది అడ్డగింత
మక్కువ రూరల్, నవంబరు25(ఆంధ్రజ్యోతి): ఏవోబీ సరిహద్దు ప్రాంతం కొఠియాలో మరోసారి ఒడిశా అధికారులు రెచ్చిపోయారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. మంగళవారం ఎగువమెండంగిలో ‘ రైతన్నా.. మీ కోసం’ నిర్వహించేందుకు వ్యవసాయశాఖతో పాటు పట్టుచెన్నారు సచివాలయ సిబ్బంది అక్కడకు వెళ్లారు. గ్రామస్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం పొట్టంగి బీడీవో రామచంద్రనాయక్, తహసీల్దార్ దేబేంద్రధరువా పోలీసులతో ఆ గ్రామానికి చేరుకున్నారు. కొఠియా గ్రామాల్లో ఎటువంటి సర్వేలు, కార్యక్రమాలు చేపట్టొద్దని ఏపీ సిబ్బందిని అడ్డుకున్నారు. కొఠియా గ్రామాలు ఒడిశా రాష్ట్రంలో విలీనమై ఉన్నాయని, ఆంధ్రా ప్రభుత్వ కార్యకలాపాలేవి ఇక్కడ నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు. తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనడంతో ఏపీ సిబ్బంది వెనుదిరిగారు. కాగా ఒడిశా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 14న గంజాయిభద్రలో తోణాం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని వారు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఒడిశా అధికారులు రెచ్చిపోయారు. కొఠియాపై ఆలోచించాలని ఈనెల 16న పాడేరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రికి మంత్రి సంధ్యారాణి లిఖితపూర్వక విజ్ఞాపన చేశారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితి మారలేదు. దీనిపై ఇరురాష్ర్టాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.