Share News

Leakages everywhere ఎక్కడికక్కడే లీకేజీలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:54 PM

Leakages everywhere విజయనగరంలో తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్లు పట్టుతప్పాయి. చాలాచోట్ల పూర్తిగా తుప్పుపట్టాయి. ఎక్కడికక్కడే లీకులు ఏర్పడుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా వాటినే వినియోగిస్తుండడంతో పాడయ్యాయి. అధికారులు కొత్త పైపులను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటికి మరమ్మతులు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉండడం లేదు. ప్రతిరోజూ చాలా తాగునీరు వృథాగా పోతోంది.

Leakages everywhere ఎక్కడికక్కడే లీకేజీలు
అంబటిసత్రం కూడలి వద్ద పైపులైన్‌ నుంచి లీకులు

ఎక్కడికక్కడే లీకేజీలు

నాలుగు దశాబ్దాలుగా అవే పైప్‌లైన్ల వినియోగం

పట్టు తప్పుతున్న వైనం

మరమ్మతులకే రూ.లక్షల్లో వ్యయం

పైప్‌లైన్‌ మార్పుపై దృష్టి సారించని అధికారులు

విజయనగరంలో తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్లు పట్టుతప్పాయి. చాలాచోట్ల పూర్తిగా తుప్పుపట్టాయి. ఎక్కడికక్కడే లీకులు ఏర్పడుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా వాటినే వినియోగిస్తుండడంతో పాడయ్యాయి. అధికారులు కొత్త పైపులను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటికి మరమ్మతులు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉండడం లేదు. ప్రతిరోజూ చాలా తాగునీరు వృథాగా పోతోంది.

విజయనగరంటౌన్‌, డిసెంబరు8(ఆంధ్రజ్యోతి):

విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్‌ల ద్వారానే ఇప్పటికీ తాగునీటి పంపిణీ జరుగుతోంది. వాటిని మార్చే దిశగా అధికారులు ఆలోచించడం లేదు. కొన్ని పైపులు మురుగు కాల్వల్లో ఉండటంతో అవి మరింత దారుణంగా కనిపిస్తున్నాయి. తాగునీటిలో మురుగు కలిసిపోయి నీరు కలుషితం అవుతోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ప్రధాన రహదారిలో ఉన్న అంబటిసత్రం, కొత్తపేట, కంటోన్మెంట్‌, దాసన్నపేట ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పైప్‌లైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. బాగు చేయించేందుకు నూతనంగా వేసిన తారురోడ్డును సైతం తవ్వేస్తున్నారు. రిపేరు పనులకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు తప్పా కొత్త పైపులైన్‌ మార్పునకు ప్రయత్నించడం లేదు.

ఫ నగర సమీపంలోని నెల్లిమర్ల నుంచి 11 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ ఉంది. అలాగే ముషిడిపల్లి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న 36 వాటర్‌ ట్యాంకులకు తాగునీరు పంపిణీ జరుగుతోంది. ఈప్రధాన పైపులైన్‌కు కూడా అక్కడికక్కడ లీకులు ఇచ్చి తాగునీరు వృథాగా పోతోంది.

పైప్‌లైన్‌లు మార్చాలి

నగరంలో చాలాచోట్ల పైపులైన్‌లు తుప్పుపట్టి పాడయ్యాయి. తరచూ మరమ్మతులు చేపట్టి వాటికే రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పైపులైన్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలి.

బెవర వేణుగోపాల్‌, స్థానికుడు, 45వ డివిజన్‌

రూ.వెయ్యికోట్లు కావాలి

నగరంలో కొన్నిచోట్ల పైపులైన్‌ పాడవ్వడం వాస్తవమే. ఏర్పాటుచేసి సుమారు నాలుగు దశాబ్దాలు అయ్యి ఉండొచ్చు. పాడవుతున్నప్పుడు మరమ్మతులు చేపడుతున్నాం. నగరమంతా నూతన పైపులైన్‌ ఏర్పాటుచేయాలంటే సుమారు రూ.వెయ్యి కోట్లు అవసరం. ఇటీవల అమృత-2 పథకంలో భాగంగా రూ.66కోట్లతో పైపులైన్‌ ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం.

- ప్రసాద్‌, ఈఈ, కార్పొరేషన్‌, విజయనగరం

Updated Date - Dec 08 , 2025 | 11:54 PM