Share News

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:56 PM

మండలంలోని కర్లాం వెంకటరామ కోళ్ల పరిశ్రమ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
కార్మికులకు మద్దతుగా గేటు బయట బైఠాయించిన నాయకులు, ప్రజలు

చీపురుపల్లి, జులై 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్లాం వెంకటరామ కోళ్ల పరిశ్రమ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక కుటుంబాలు, పరిసర గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. వీరికి మద్దతుగా పలువురు టీడీపీ నాయకు లు పరిశ్రమ గేటు ఎదుట బైఠాయించారు. ఈసంద ర్భంగా నాయకులు, కార్మిక కుటుంబీకులు గేటును తోసుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో, అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ దన్నాన రామచంద్రుడు, అలజంగి ఎంపీటీసీ శనపతి శ్రీనివాసరావు, వర్మరాజు, గొర్లె లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ గతంలో స్థానిక గ్రామాలకు చెందిన కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండానే వారిని విధుల నుంచి తొలగించారన్నారు. రెండు నెలలుగా సమస్యపై పోరాటం చేస్తున్నా యాజమా న్యం పట్టించుకోవడం లేదని, అంతేకాక పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులను తెప్పించి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంతో తాము నేరుగా మాట్లాడబో మని, ఎమ్మెల్యే కళావెంకటరావు సమక్షంలో చర్చలకు అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. దీంతో యాజమాన్య ప్రతినిధి.. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుతో మాట్లాడి, ఈనెల 11న చర్చలకు తేదీని ఖరారు చేయడంతో, నాయకులు, ప్రజలు ఆందోళనను విరమించారు. సీఐ జి.శంకరరావు, చీపురుపల్లి, గరివిడి ఎస్‌ఐలు ఎల్‌.దామోదరరావు, బి.లోకేష్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jul 07 , 2025 | 11:56 PM