land rates hike at kottavalasa కొత్తవలసకు భూమ్
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:54 PM
land rates hike at kottavalasa కొత్తవలస-గిడిజాల రోడ్డులో ఉన్న గ్రామాలకు మహర్దశ పట్టనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా గ్రామాలు విశాఖ జిల్లా ఆనందపురం మండలం, భీమిలి మండలానికి సరిహద్దు గ్రామాలుగా ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆనందపురం, భీమిలి మండలాలు ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకోవైపు ఆనందపురం మండలం తర్లువాడలోనే గూగుల్ డేటా సెంటర్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. దీన్ని అనుసరించి మరిన్ని కంపెనీలు వస్తాయన్నది ప్రభుత్వ వర్గాల అంచనా.
కొత్తవలసకు భూమ్
విశాఖ జిల్లా సరిహద్దులో ఉన్న ఈ మండల పరిధి గ్రామాలకు మహర్దశ
అమాంతం పెరుగుతున్న భూముల ధరలు
విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటుతో కీలక మలుపు
అనుబంధంగా మరిన్ని కంపెనీలు రావొచ్చునని అంచనాలు
కొత్తవలస-గిడిజాల రోడ్డులో ఉన్న గ్రామాలకు మహర్దశ పట్టనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా గ్రామాలు విశాఖ జిల్లా ఆనందపురం మండలం, భీమిలి మండలానికి సరిహద్దు గ్రామాలుగా ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆనందపురం, భీమిలి మండలాలు ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకోవైపు ఆనందపురం మండలం తర్లువాడలోనే గూగుల్ డేటా సెంటర్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. దీన్ని అనుసరించి మరిన్ని కంపెనీలు వస్తాయన్నది ప్రభుత్వ వర్గాల అంచనా.
కొత్తవలస, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా ఆనందపురం మండలానికి సరిహద్దు గ్రామంగా కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెం, రెల్లి, ముమ్మనవానిపాలెం గ్రామాలున్నాయి. అప్పన్నదొరపాలెం గ్రామం నుంచి ఆనందపురంలోని వివిధ గ్రామాల వరకు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఎకరం విలువ కోట్ల రూపాయలు పలుకుతోంది. ఆనందపురం మండలం తర్లువాడలో గూగల్ డేటా సెంటర్‌కు సుమారు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. లక్షా 33 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో గూగుల్ డేటా కేంద్రానికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు చేసే ప్రాంతం కొత్తవలసకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అప్పన్నదొరపాలెం తరువాత బీమన్నదొరపాలెం, తంగుడుబిల్లి అగ్రహారం, వేమగొట్టువానిపాలెం, గిడిజాల గ్రామం తరువాతే తర్లువాడ గ్రామం ఉంది. దీంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.
- డేటా కేంద్రం భూములకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ విభాగం వస్తోంది. కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలోని 516 ఎకరాల 58సెంట్లను గ్రేహౌండ్స్ దళాల శిక్షణ కేంద్రం కోసం కేటాయించింది.
- ఇక విశాఖ జిల్లా భీమునిపట్నం సరిహద్దు గ్రామమైన చినరావుపల్లి, పెదరావుపల్లి గ్రామాలలో పతంజలి సంస్థకు సుమారు 300 ఎకరాలను గతంలోనే రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో పతంజలి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని కొద్ది నెలల కిందట ఇక్కడకు వచ్చిన సంస్థ అధిపతి రాందేవ్‌బాబా తెలిపారు.
విశాఖ జిల్లాకు చెందిన రెండు మండలాలు కొత్తవలస మండలానికి చెందిన సరిహద్దు గ్రామాలతో సంబంధాలు కలిగి ఉండడంతో అక్కడికి వచ్చేవారు కొత్తవలస మండల భూములను కూడా చూస్తున్నారు. మరోవైపు భోగాపురంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రాయానికి ఆనందపురం నుంచి కనెక్టవిటీ ఉంది. ఆనందపురం నుంచి కొత్తవలస మండలంలోని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండడంతో అభివృద్ధి శరవేగంగా జరగవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూలో ఎకరం ధర కోటిరూపాయల నుంచి కోటీ 50 లక్షల వరకు పలుకుతోంది. డేటా కేంద్రానికి శంకుస్థాపన జరిగితే ఇంకా ఏ స్థాయిలోనైనా పెరగవచ్చునని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.
- కొత్తవలస రైల్వే గేట్ దాటిన తరువాత గ్రామాల్లోని భూములను రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పోలవరం కాలువ, ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన పైప్‌లైన్‌ల కోసం భూ సేకరణ చేసేశారు. ఇక మండల పరిధిలో మిగిలిన భూములు రెల్లి, అప్పన్నదొరపాలెం గ్రామాలలో ఉండడం... ఇవి విశాఖ జిల్లాకు సరిహద్దు మండలాలైన ఆనందపురం, భీమునిపట్నం మండలాలకు సరిహద్దు కావడం కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
---------