Share News

Lack of Facilities.. వసతుల కొరత.. చదువులకు అవస్థ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:05 AM

Lack of Facilities.. Struggle for Education జియ్యమ్మవలస మండలం చినమేరంగి ఇంటి గ్రేటెడ్‌ బీసీ వసతి గృహం పరిస్థితి దయనీయంగా మారింది. గదులు అధ్వానంగా మారగా.. తాగునీటి, మరుగుదొడ్ల సదుపాయాలు కొరవడ్డాయి. పూర్తిగా పాడైన గచ్చులు, భద్రత లేని విద్యుత్‌ బోర్డులు.. కంపుకొడుతున్న పరిసరాల మధ్య విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది.

Lack of Facilities..  వసతుల కొరత.. చదువులకు అవస్థ
ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌

  • కొరవడిన తాగునీరు, మరుదొడ్ల సదుపాయాలు

  • పాడైన గచ్చులు.. ప్రమాదకరంగా విద్యుత్‌ బోర్డులు

  • ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి ఇంటిబాట పడుతున్న విద్యార్థులు

జియ్యమ్మవలస, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం చినమేరంగి ఇంటి గ్రేటెడ్‌ బీసీ వసతి గృహం పరిస్థితి దయనీయంగా మారింది. గదులు అధ్వానంగా మారగా.. తాగునీటి, మరుగుదొడ్ల సదుపాయాలు కొరవడ్డాయి. పూర్తిగా పాడైన గచ్చులు, భద్రత లేని విద్యుత్‌ బోర్డులు.. కంపుకొడుతున్న పరిసరాల మధ్య విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. సరైన వసతి సౌకర్యం లేని కారణంగా దీనికి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఈ కళాశాలలో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ డిప్లొమ కోర్సులు ఉన్నాయి. వాటిని చదివేందుకు ఏటా విద్యార్థులు అధిక సంఖ్యలో కౌన్సిలింగ్‌కు హాజరవుతుంటారు. కానీ ఇక్కడ కనీస వసతి సౌకర్యాలు లేక తిరిగి వెళ్లిపోతున్నారు. వాస్తవంగా ఒక్కో గ్రూపులో 60 మంది చొప్పున 540 మంది ఈ కళాశాలలో ఉండాలి. కానీ 2025-26లో 63 మంది ఇక్కడకు రాగా.. 50 మంది తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుత విద్యా సంవత్స రానికి ఈ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలు కలిపి మొత్తంగా 34 మంది మాత్రమే ఉన్నారు. 2023-24లో మొత్తం 100 మంది పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ఇక్కడ జాయిన్‌ అయితే 97 మంది తిరిగి వెళ్లిపోయారు. 2024-25లో 124 మంది జాయిన్‌ అవగా కేవలం 18 మంది మాత్రమే ఇక్కడ ఉండిపోయారు.

ఇదీ పరిస్థితి..

చినమేరంగిలో 2005-06లో ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ నిర్మించారు. మొదట ఈ భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కొనసాగేది. ఆ తరువాత ఇది ప్రీ, పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రీమెట్రిక్‌ విద్యార్థులు 54 మంది, పోస్టుమెట్రిక్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 26 మంది, డిప్లొమా విద్యార్థులు 18 మంది ఉన్నారు. అయితే వారికి తాగునీరు అందుబాటులో లేదు. సమీపంలో ఉన్న ఎస్సీ వసతి గృహం నుంచి తాగడానికి నీరు తీసుకోవాల్సి వస్తోంది. వంటలకు పక్కనే ఉన్న నేలబావి నుంచే నీరు తెస్తున్నారు. రన్నింగ్‌ వాటర్‌ లేక మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. దీంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ హాస్టల్‌లో గచ్చులూడిపోయిన నేలపై వారు పడుకోవాల్సిన దుస్థితి. రూముకు బల్బు, ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్థానికులు ఇష్టాను సారంగా ఆవులు, గేదెలు కట్టడంతో వసతి గృహం ప్రాంగణం అధ్వానంగా మారింది.

రూ.18.40 లక్షలతో అంచనా

చినమేరంగిలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ పూర్తిస్థాయిలో సుందరీకరణ, వసతుల కల్పనకు రూ.18.40 లక్షలు అవసరమని బీసీ సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేసి ఇటీవల కలెక్టర్‌కు నివేదించారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:05 AM