Share News

Labor Codes లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:08 AM

Labor Codes Must Be Repealed కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక, కర్షక, ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో ఆయా సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Labor Codes   లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
జిల్లా కేంద్రంలో ర్యాలీ చేస్తున్న ప్రజా సంఘాలు

పార్వతీపురం టౌన్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక, కర్షక, ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో ఆయా సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బెలగాం సుందరయ్య భవనం నుంచి పాతబస్టాండ్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను హరించేలా కేంద్ర సర్కారు వ్యవహరిస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ల అమలు దుర్మార్గపు చర్య అని అన్నారు. దీనివల్ల పని ప్రదేశాల్లో శ్రామికులకు రక్షణ, ఆరోగ్య భద్రత లేకుండా పోతుందని వెల్లడించారు. వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌, రవాణా, బ్యాంకు, ఇన్సూరెన్స్‌, స్టీలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుండడం బాధాకరమన్నారు. కార్మికులకు కనీస వేతనంతో పాటు ఉపాధిహామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని నినదించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, ఇప్టూ, ఏఐసీసీటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:08 AM