Share News

జిల్లాకు కర్నూలు ఉల్లి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:04 AM

ఉల్లిరైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

జిల్లాకు కర్నూలు ఉల్లి
విజయనగరం రైతు బజార్‌లో కర్నూలు ఉల్లిపాయలను దించుతున్న దృశ్యం

- 13 టన్నులు దిగుమతి

- రైతు బజార్లలో విక్రయాలు

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉల్లిరైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి వాటిని రైతుబజార్లలో విక్రయించేందుకు సిద్ధమవుతుంది. కర్నూలులో ఉల్లిధర పూర్తిస్థాయిలో పతనమైంది. అక్కడ కిలో 50 పైసలు పలుకుతుండడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఉల్లి రైతుకు ఊరటకల్పించేందుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటాకు రూ.1,200 చొప్పున చెల్లించి ఆ ఉల్లిని రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని రైతు బజార్లకు ఇప్పటికే దఫాదఫాలుగా కర్నూలు ఉల్లి దిగుమతి అయింది. శుక్రవారం మరో 13 టన్నుల ఉల్లి వచ్చింది. ఇంతవరకూ ఆయా రైతు బజార్లలో రెండు రకాల ఉల్లిపాయలు విక్రయించే వారు. ప్రస్తుతం అన్ని రైతు బజార్లలో కర్నూలుకు చెందిన ఉల్లినే అందుబాటులో ఉంచారు. కిలో రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. వంద రూపాయలకు ఏడు కిలోలు ఇస్తున్నారు. దీంతో వినియోగదారులు కర్నూలు ఉల్లి సైజు చిన్నదైనప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉల్లి రైతుకు కూడా కొంత ఉపశమనం కలిగినట్టయింది. కర్నూలు ఉల్లిని రైతు బజార్లకు కేటాయించి విక్రయిస్తున్నట్టు మార్కెటింగ్‌ శాఖాధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:04 AM