Share News

Kotadurgaamma.. కోటదుర్గమ్మా.. కరుణించు!

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:25 AM

Kotadurgaamma.. Show Your Mercy! ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు తెరచాటున ఉన్న అమ్మవారు సోమవారం నిజరూపంతో భక్తులకు దర్శనమిచ్చింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ దర్శన భాగ్యం ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ, ఒడిశా నుంచి వేలాది మంది తరలివచ్చారు.

Kotadurgaamma..    కోటదుర్గమ్మా.. కరుణించు!
క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

  • నేత్రపర్వం.. నిజరూప దర్శనం

  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు

పాలకొండ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు తెరచాటున ఉన్న అమ్మవారు సోమవారం నిజరూపంతో భక్తులకు దర్శనమిచ్చింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ దర్శన భాగ్యం ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ, ఒడిశా నుంచి వేలాది మంది తరలివచ్చారు. ముందుగా కటకం కటుంబ సభ్యులు ఉత్సవాల ముహూర్తపు రాట వేశారు. ఉదయం 8 గంటలకు కలశ స్థాపన చేశారు. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద శర్మ, ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం 8.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అమ్మవారు నిజరూపంలో దర్శనమిచ్చింది. ఆతర్వాత కోటదుర్గమ్మ బాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు సామూహిక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా దాదాపు 200 మంది పైగా భక్తులు భవానీ దీక్షలు చేపట్టారు. ప్రధాన అర్చకుడు శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మాలాధారణ చేశారు. నవగాం గ్రామానికి చెందిన ఎల్‌.ఉమామహేశ్వరరావు స్వయంగా చిత్రీకరించిన అమ్మవారి పాటను ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. అమ్మవారిని దర్శించడానికి వచ్చిన భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. అమ్మవారిని శ్రీకాకుళం జిల్లా అడిషనల్‌ న్యాయాధికారి నాగమణి, మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే వి.కళావతి తదితరులు దర్శించుకున్నారు.

క్యూలైన్లు కిటకిట

ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది శీఘ్ర, వీవీఐపీ, రూ.వంద, రూ.30తో పాటు ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. ఆయా క్యూలైన్లలో భక్తులు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది రాగా.. వారికి తాగునీరు, మజ్జిగతో పాటు చిన్నారులకు అవసరమైన పాలను అందించారు. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజారావుతో పాటు ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, వలంటీర్లు సేవలు అందించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Sep 23 , 2025 | 12:26 AM