Kota Durgamma తెరచాటుకు కోటదుర్గమ్మ
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:17 PM
Kota Durgamma Behind the Curtain ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతుంది. వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు దేవాలయ సిబ్బంది చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్న నేపఽథ్యంలో ఏటాలానే సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారు తెరచాటుకు వెళ్లనున్నారు.
అక్టోబరు 2 వరకు నవరాత్రి ఉత్సవాలు
ఉత్సవ వేళ దేవాలయంలో సమస్యల తిష్ఠ
పాలకొండ, సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతుంది. వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు దేవాలయ సిబ్బంది చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్న నేపఽథ్యంలో ఏటాలానే సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారు తెరచాటుకు వెళ్లనున్నారు. 22న అమ్మవారి నిజరూప దర్శనంతో భక్తులకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. దీనిలో భాగంగానే చందనం, పసుపు, కుంకుమతో అమ్మవారి విగ్రహానికి పూత పూయపోయనున్నట్టు ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీప్రసాదశర్మ, ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. అప్పటి వరకు ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహం ద్వారానే అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ఆలయ ఈవో అన్నారు. ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్లు సమస్యను అధిగమిస్తామన్నారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీరు, మౌలిక వసతులతో పాటు ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. తూర్పు ద్వారం ఎదురుగా రూ.100, రూ.20, ఉచిత దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేసి శీఘ్ర దర్శనానికి ఏర్పాటు చేస్తున్నామని, ఘటాలతో వచ్చేవారికి ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ఇదీ పరిస్థితి..
ఏటా భక్తుల విరాళాలు, సహాయ సహకారాలతో కోటదుర్గమ్మ ఉత్సవాలు జరుపుతున్నారు. దేవదాయ శాఖ అంతంతమాత్రంగా నిఽధులు కేటాయిస్తుండడంతో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పన సాధ్యం కావడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవంగా నిజరూప దర్శనానికి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాలు భాగంగానే స్థానిక భక్తులు ఆది, మంగళ, బుధవారాల్లో అమ్మవారికి ముర్రాటలు, ఘటాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో వారికి అవస్థలు తప్పడం లేదు. ఉత్తరాంధ్రలో అరసవల్లి తర్వాత రెండో స్థానంలో కోటదుర్గమ్మ ఆలయం నిలుస్తుండగా.. ఇక్కడ దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధలు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వీఐపీలు, వీవీఐపీల దర్శన సమయంలో సామాన్య భక్తులు ఇక్కట్లుకు గురికాకుండా చూడాల్సి ఉంది. అమ్మవారికి ము ర్రాటలు, ఘటాలు సమర్పించే భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేయాలి. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఆలయ ప్రాంగణంలో కేవలం మూడు బాత్‌రూమ్‌లే ఉండడంతో కేశఖండన తర్వాత స్నానాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. గంటల కొద్దీ క్యూలైన్‌లో నిరీక్షించే మహిళా భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. క్యూలైన్లలో ఉన్న వారికి నీరు, ఎండ నుంచి రక్షణకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.