Share News

King Cobra కింగ్‌ కోబ్రా కలకలం

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 PM

King Cobra Commotion కురుపాం మండలంలో మంగళవారం కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. స్థానికులను హడలెత్తించింది. సుమారు 16 అడుగుల విష సర్పం కిచ్చాడ గ్రామంలోని అగురు శివ ఇంటి పెరట్లోని మరుగుదొడ్డిలో చేరి భయాందోళనకు గురి చేసింది. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీశాఖాధికారులకు తెలియజేశారు.

King Cobra   కింగ్‌ కోబ్రా కలకలం
కింగ్‌ కోబ్రాను పట్టుకుంటున్న దృశ్యం

  • హడలెత్తిపోయిన కిచ్చాడ వాసులు

  • పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన ఫారెస్ట్‌ సిబ్బంది

కురుపాం/కురుపాం రూరల్‌, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): కురుపాం మండలంలో మంగళవారం కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. స్థానికులను హడలెత్తించింది. సుమారు 16 అడుగుల విష సర్పం కిచ్చాడ గ్రామంలోని అగురు శివ ఇంటి పెరట్లోని మరుగుదొడ్డిలో చేరి భయాందోళనకు గురి చేసింది. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీశాఖాధికారులకు తెలియజేశారు. దీంతో కురుపాం అటవీశాఖాధికారి గంగరాజు విశాఖపట్నం నుంచి వన్యప్రాణుల సంరక్షణ సభ్యులను రప్పించారు. వెంటనే తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తూర్పు కనుమ వన్యప్రాణి సంరక్షణ సభ్యుడు కంటిమహంతి మూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు ఫారెస్ట్‌ సిబ్బంది చాకచక్యంగా కింగ్‌ కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అరుదైన ఇటువంటి విష సర్పాలను పరిరక్షించాల్సి ఉందని వన్య ప్రాణి సంరక్షణ సభ్యుడు మూర్తి చెప్పారు. ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అడవులు తరిగిపోవడం వల్లే అవి గ్రామాల్లోకి వస్తున్నాయని చెప్పారు.

ఓ వైపు ఏనుగులు.. మరోవైపు పాములు

ఇప్పటికే గజరాజుల కారణంగా ఇబ్బందులు పడుతున్న మన్యం జిల్లావాసులు తాజాగా విష సర్పాల సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో తాజాగా కింగ్‌ కోబ్రాలు కనిపిస్తుండడంతో వాటి వల్ల ప్రాణహాని ఉంటుందేమోనని భయపడుతున్నారు. మైదాన ప్రాంతం కిచ్చాడ గ్రామంలో కింగ్‌ కోబ్రాను అటవీశాఖ అధికారులు పట్టుకుని అడవిలో విడిచిపెట్టినప్పటికీ.. రానున్న రోజుల్లో మరికొన్ని ఇలా గ్రామాల్లోకి వస్తే తమ పరిస్థితేమిటని టెన్షన్‌ పడుతున్నారు. ఇటీవల రావాడ వెళ్లే రోడ్డులో ఇంజనీంగ్‌ కళాశాల సమీపంలో రెండు కింగ్‌ కోబ్రాలు హల్‌చల్‌ చేశాయి. పాలేం, కుంబుకోట ప్రాంతాల్లోనూ కనిపించి నట్లు రైతులు తెలియజేస్తున్నారు. ఇలా అయితే రాత్రి వేళల్లో బయట తిరుగాడడం కష్టమని వాపోతున్నారు. అవి గ్రామాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:14 PM