Share News

keep quiet ష్‌.. గప్‌చుప్‌!

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:17 AM

keep quiet జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగాన్ని ఓ కుదుపు కుదిపేసిన అక్రమాల వ్యవహారం తాజాగా కొత్తమలుపు తిరిగింది. ఇకపై ఎన్టీఆర్‌ వైద్యసేవలో జరిగే ఏ విషయమైనా మనమధ్యే ఉండాలని, బయట పెట్టుకుంటే అందరం నష్టపోతామని అధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు తీర్మానించు కున్నట్లు సమాచారం.

keep quiet ష్‌.. గప్‌చుప్‌!

ష్‌.. గప్‌చుప్‌!

అందరం సర్దుకుపోదాం రండి

ఎన్టీఆర్‌ వైద్యసేవలో ‘రాజీ’ ఫార్ములా

జిల్లా కేంద్రంలో ఓ టీమ్‌ లీడరే వసూల్‌ రాజా

ఇంటిగుట్టు బయటకు వెళ్లరాదని తీర్మానం

ఇంకోవైపు వాటాలపై ఒప్పందాలు

అక్రమాలపై లోతుగా పరిశీలిస్తున్నామన్న డీఎంహెచ్‌వో

మెంటాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగాన్ని ఓ కుదుపు కుదిపేసిన అక్రమాల వ్యవహారం తాజాగా కొత్తమలుపు తిరిగింది. ఇకపై ఎన్టీఆర్‌ వైద్యసేవలో జరిగే ఏ విషయమైనా మనమధ్యే ఉండాలని, బయట పెట్టుకుంటే అందరం నష్టపోతామని అధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు తీర్మానించు కున్నట్లు సమాచారం. ఓ వైపు నష్ట నివారణ చర్యలంటూనే మరోవైపు బేరసారాలు కూడా జరగడం వారి బరితెగింపునకు అద్దం పడుతోంది. ఒక్కో ఆస్పత్రి నెలవారీ రూ.40 వేల ముడుపులు ఇచ్చేందుకు ఒప్పందానికి వచ్చారని సమాచారం. ఇందులో రూ.20 వేలు టీమ్‌ లీడర్‌కు, ఇద్దరు కీలక అధికారులకు పదేసి వేల రూపాయలు చొప్పున ముట్టేలా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ లెక్కన మొత్తం 30 నెట్వర్క్‌ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఒక్కో కీలక అధికారికి నెలకు మూడు లక్షలు చొప్పున ముట్టనున్నట్టు సమాచారం. అలాగే టీమ్‌ లీడర్‌కు నెలకు అతనికి కేటాయించిన ఆస్పత్రుల సంఖ్యను బట్టి కనిష్టంగా రూ.80వేల నుంచి లక్ష రూపాయల వరకు అందనుందని తెలియవచ్చింది.

లోతుగా ఆరా

రోగమొకటి...పేరొకటి శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం వైద్యవర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశాల మేరకు ఆఘమేఘాలపై సమావేశం ఏర్పాటు చేసి లుకలుకలుపై చర్చించిన అధికారులు వీలైనంత త్వరగా కలెక్టర్‌కు నివేదిక సమర్పించేపనిలో ఉన్నారు. ఇందులో భాగంగా అక్రమాలు, అవినీతిలో ఎవరివాటా ఎంతనేదానిపై విచారణ జరుపుతున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడిన నెట్వర్క్‌ ఆస్పత్రుల వివరాలపైనా అరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద జరిగిన చికిత్సలు, ఆపరేషన్లపై కూపీలాగుతున్నారు. టీమ్‌ లీడర్ల ద్వారా సదరు సమాచారాన్ని సేకరించి అవసరమైప పక్షంలో వైద్యం పొందిన వారిని ప్రత్యేక్షంగా కలసి మరింత అదనపు సమాచారాన్ని రాబట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మీడియాకు ఎలా వెళ్లింది

ఎన్టీఆర్‌ వైద్యసేవలో అక్రమాలు, అవినీతి బట్టబయలు కావడం సంబంధిత వర్గాల్లో సహజంగానే కలకలం రేపింది. ఇంత సమగ్ర సమాచారం ఆంధ్రజ్యోతికి ఎలా వెళ్లిందనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్‌ ఎవరి ద్వారా వెళ్లిందనేదానిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరుముగ్గురిని వాకబుచేసిన అధికారులు మిగిలిన వారిని కూడా విచారించేపనిలో ఉన్నారు.

మరో కోణం

ఎన్టీఆర్‌ వైద్యసేవలో మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్వర్క్‌లో చేరాలంటే ముందుగానే 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు జిల్లా అధికారుల చేయితడపనిదే పని జరగడం లేదని ఆసుపత్రి వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ వైద్యసేవలో కీలకంగా ఉన్న ఓ అధికారి పాలకొండలో తన సతీమణిని ఎండీగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. చీపురపల్లిలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో భాగస్వామ్యానికి కూడా ప్రయత్నించిన్నప్పటికీ డీల్‌ కుదరలేదని వైద్య అరోగ్య శాఖలో ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఓవైపు విచారణ,మరోవైపు నష్టనివారణ, ఇంకోవైపు పంపకాలపై ఒప్పందం...వెరసి ఎన్టీఆర్‌ వైద్యసేవలో ఓ రకమైన హైడ్రామా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కలెక్టర్‌కు ఇవ్వనున్న నివేదికలో పారదర్శకతపై ముందే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లోతుగా పరిశీలించాలి

జీవనరాణి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి

ఎన్టీఆర్‌ వైద్య ఆరోగ్య సేవలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై లోతుగా పరిశీలన జరుగుతోంది. కలెక్టర్‌ అంబేడ్కర్‌ కూడా దృష్టి సారించారు. జిల్లా కోఆర్డినేటర్‌ నుంచి వివరణ కోరాం. పథకంలో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదు.

---------------

Updated Date - Mar 13 , 2025 | 12:17 AM