Share News

పిల్లలపై ఓ కన్నేయండి

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:09 AM

సెలవులు అనగానే పిల్లలకు ఎక్కడ పట్టలేని ఆనందం వస్తుంది. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారుచేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి.

పిల్లలపై ఓ కన్నేయండి

- నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

- కాలక్షేపం మాటున అపాయాలు

- ఊహించని ప్రమాదాలతో మూల్యం

- తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే

రాజాం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సెలవులు అనగానే పిల్లలకు ఎక్కడ పట్టలేని ఆనందం వస్తుంది. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారుచేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి కన్నవారికి కడుపుకోతను మిగులుస్తాయి. పాఠశాలలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు. పైగా తరగతులు, సిలబస్‌ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉంటారు. వేసవి, దసరా, సంక్రాంతి సెలవులు అనేసరికి అధిక సమయం ఖాళీగా దొరుకుతుంది. అప్పుడే పిల్లలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో చోటుచేసుకున్న పరిణామాలు పిల్లల సంరక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. సోమవారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.

ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో నదులు, కాలువలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది. సాధారణంగా నీరు కనిపిస్తే పిల్లలకు ఈత కొట్టాలనిపిస్తోంది. గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎక్కువగా ఈత వస్తుంది. చిన్నప్పటి నుంచి పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఈత పెద్దగా తెలియదు. అటువంటి వారు గ్రామాలకు వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఈతకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఈతరాక ప్రమాదాలకు గురవుతుంటారు. అటువంటి వారి విషయంలో తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. సెలవులకు గ్రామాలకు వచ్చే పిల్లలకు ప్రమాదకరమైన చెరువులు, కాలువలు, కుంటల గురించి చెప్పాలి. అటువైపుగా వెళ్లినప్పుడు పెద్దవారి తోడు తీసుకొని వెళ్లాలని చెప్పాలి.

- కొందరు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న వాహనాలను తీసుకొని రోడ్లపైకి వచ్చేస్తుంటారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రత పాటించడం లేదు. అర్ధరాత్రి లాంగ్‌ డ్రైవింగ్‌ అంటూ చేసే ప్రయాణాలు చేటు తెస్తున్నాయి. అతి వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ఒక్కోసారి వీరి కారణంగా ఎదుటి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. అందుకే పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం.

- ఆన్‌లైన్‌ తరగతులు, అదనపు పరిజ్ఞానం కోసమంటూ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో సెల్‌ఫోన్లు పెడుతుంటారు. దాంతో ఎంతో ప్రయోజనమో చెప్పలేం కానీ అనర్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫొటోల యాప్స్‌ మొదలు ఆన్‌లైన్‌ గేమ్స్‌ వరకూ అన్ని యాప్‌ల గురించి పిల్లలు తెలుసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో అకౌంట్లు తెరుస్తున్నారు. వారు నేర్చుకునే విషయాలు ఎటువైపునకు దారితీస్తాయో అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. అందుకే పిల్లలకు ఈ సెలవుల్లో అవసరం మేరకు మాత్రమే సెల్‌ఫోన్లు ఇవ్వాలి.

- జిల్లాలో మైనర్లు, విద్యార్థులు మత్తు బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్‌ అలవాటు ఉంటే మిగతా వారు ఆకర్షితులవుతున్నారు. సరదాగా ఒకసారి అనే మాటగా మొదలై.. మత్తు అనే మాయలో పడేస్తోంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

దసరా సెలవుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఒక కన్నేసి ఉంచాలి. బైక్‌లతో పాటు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిదే. వారికి ఆడుకోవడానికి స్వేచ్ఛనివ్వడమే కాకుండా..వారిని కుటుంబసభ్యులు కనిపెట్టుకొని ఉండాలి.

-యు.మాణిక్యాలనాయుడు, డీఈవో, విజయనగరం

Updated Date - Sep 22 , 2025 | 12:09 AM