Share News

Just That One Day..! ఆ ఒక్కరోజే..!

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:10 AM

Just That One Day..! సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు వారంలో కేవలం ఆదివారం మాత్రమే రద్దీగా ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో వెలవెల బోతున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో గతంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లు పాతపడిపోవడం, కొత్తదనం లేకపోవడంతో ఈ ప్రదేశాలకు సందర్శకుల రద్దీ తగ్గుతూ వస్తోంది.

Just That One Day..! ఆ ఒక్కరోజే..!
శనివారం పర్యాటకులు లేక వెలవెలబోతున్న ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌

  • పర్యాటక ప్రదేశాలకు తగ్గుతున్న ఆదరణ

  • సందర్శకులను ఆకర్షించని ఈవెంట్‌లు

  • ధరల మోతతో బెంబేలు

  • కొన్నేళ్లుగా పెరగని ఆదాయం

  • ఆర్భాటాలతోనే సరిపెడుతున్న వైనం

సీతంపేట రూరల్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు వారంలో కేవలం ఆదివారం మాత్రమే రద్దీగా ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో వెలవెల బోతున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో గతంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లు పాతపడిపోవడం, కొత్తదనం లేకపోవడంతో ఈ ప్రదేశాలకు సందర్శకుల రద్దీ తగ్గుతూ వస్తోంది. కొద్ది రోజుల కిందట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌, మెట్టుగూడ జలపాతం వద్ద సుందరీకరణ పనులు చేపట్టారు. పార్క్‌ లోపల భాగంలో రంగులు వేశారు. ఫొటోషూట్‌ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఎంత చేసినా పర్యాటకుల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. దీనిని అధిగమించేందుకు ఐటీడీఏ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పిక్నిక్‌ల సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి చూసుకుంటే..ఒక్క ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో పర్యాటకుల సందడి కనిపించడం లేదు. గత నెలలో ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌, మెట్టుగూడ జలపాతం నుంచి ఒక్క ఆదివారమే రూ.3.80లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన రోజుల్లో మాత్రం పర్యాటకుల తాకిడి లేక పెద్దగా ఆదాయం ఉండడం లేదు.

ధరలు ఇలా..

- సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌, మెట్టుగూడ జలపాతం లోపల ఏర్పాటు చేసే ఈవెంట్‌ల ధరలపై పర్యాటకులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్క్‌లో లోపల భాగంలో వైవిద్య విహార్‌(ఆల్‌టెర్రయిన్‌)ఈవెంట్‌లో వాహనం నడపాలంటే ఒక్కొక్కరికీ రూ.300, ఉయ్యాల విహార్‌ ఎక్కాలంటే రూ.200, హై సైకిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నారు. మరికొన్ని చిన్నపాటి ఈవెంట్‌లలో సైతం అధిక మొత్తంలో వసూలు చేస్తుండడంపై సందర్శకులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

- ఎన్టీఆర్‌ పార్కు, మెట్టుగూడ జలపాతం ప్రవేశ రుసుం గతంలో ఒక్కొక్కరికీ రూ.10 ఉండగా.. ఇటీవల రూ.30 వరకు పెంచారు. బైక్‌, కారు పార్కింగ్‌కు రూ.20, 50 చొప్పున వసూలు చేస్తున్నారు.

- గతనెల ఒకటో తేదీన పిక్నిక్‌ సీజన్‌ స్టార్ట్స్‌ పేరుతో రూ.లక్షలు వెచ్చించి అద్దె ప్రాతిపదికన పార్క్‌లోహాట్‌ఎయిర్‌ బెలూన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్కరికీ రూ.1000వరకు ప్రకటిం చడంతో ఈ సాహసోపేతమైన హాట్‌ఎయిర్‌ బెలూన్‌ ఎక్కెందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈవెంట్‌ నిర్వాహకులు రెండు రోజుల్లోనే హాట్‌ఎయిర్‌ బెలూన్‌ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా వీరికి ఐటీడీఏ కొంత మొత్తం అద్దెను చెల్లించినట్లు తెలిసింది.

- ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో ఏయే ఈవెంట్‌లు ఏర్పాటు చేస్తారనే దానిపై ఐటీడీఏ అధికారులు పంపిన డీపీఆర్‌(డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిధులు విడుదలైన వెంటనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఆదాయాన్ని సక్రమంగా వినియోగించక..

పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఐటీడీఏ అధికారులు సక్రమంగా వినియోగంచ లేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా చోట్ల పనిచేస్తున్న గిరిజన నిరుద్యోగ యువతకు జీతాల చెల్లింపులు మినహా మిగతా ఆదాయం పర్యాటక ప్రదేశాల అభివృద్థికి విని యోగించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలపై ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఏదేమైనా ఆర్భాటాలకే లక్షల్లో ఖర్చులు చేస్తున్నారు తప్పా పర్యాటక ప్రదేశాల అభి వృద్థిపై ఐటీడీఏ అధికారులు దృష్టిసారించడం లేదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపి స్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఏపీవో ఏమన్నారంటే..

‘సీతంపేట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో కొత్త హంగులు ఏర్పాటు, గిరిజన మ్యూజియం పనుల పూర్తికి గాను ప్రభుత్వానికి పంపిన డీపీఆర్‌కు అనుమతులు వచ్చాయి. నిధులు విడుదలైతే పార్క్‌లో కొత్త ఈవెంట్‌లు ఏర్పాటు చేస్తాం. మ్యూజియం పనులు కూడా పూర్తవుతాయి. ఇక పార్క్‌లో నిర్వహించే ఈవెంట్‌ల ధరలపై ఎటువంటి మార్పులు చేయలేదు. ఒక్క వెహికిల్‌ పార్కింగ్‌ రుసుమును మాత్రమే పెంచాం.’ అని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు తెలిపారు.

Updated Date - Dec 01 , 2025 | 01:10 AM