Ration in Advance జూలై రేషన్ ముందుగానే ...
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:07 PM
July Ration to be Distributed in Advance వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా 26వ తేదీ నుంచి 31 లోపు వారి ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే జూలైలో ఇవ్వాల్సిన నిత్యావసర సరుకులను ఈ నెలాఖరు నుంచే పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం కలెక్టర్ , సివిల్ సప్లైస్ డీఎంలు, జీసీసీ డీఎంలకు పూర్తిస్థాయిలో అందజేసింది. ఈ మేరకు జిల్లాలో యంత్రాంగం రంగంలోకి దిగింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీని ప్రారంభించిన డీలర్లు
ప్రతినెలా ఇదే విధంగా రేషన్ అందజేత
జిల్లాలో 40 వేల మందికి లబ్ధి
జియ్యమ్మవలస, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా 26వ తేదీ నుంచి 31 లోపు వారి ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే జూలైలో ఇవ్వాల్సిన నిత్యావసర సరుకులను ఈ నెలాఖరు నుంచే పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం కలెక్టర్ , సివిల్ సప్లైస్ డీఎంలు, జీసీసీ డీఎంలకు పూర్తిస్థాయిలో అందజేసింది. ఈ మేరకు జిల్లాలో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే డీలర్లు, సేల్స్‌మెన్‌లు ఆ పనిలో పడ్డారు. సర్కారు తాజా నిర్ణయంతో జిల్లాలో మొత్తం 40 వేల మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈనెల నుంచి రేషన్ డిపోల నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించింది. తాజాగా వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించాలని ఆదేశించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలోని 15 మండలాల్లో మొత్తంగా 578 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 2,20,934 రైస్‌కార్డులు, 55,939 ఏఏవై కార్డులు ఉన్నాయి. ఇందులో 65 ఏళ్లు పైబడిన వృద్ధుల రేషన్‌కార్డులు 29,864 వరకూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రతి నెలా ఒకటోతేదీ నుంచి డిపోల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారు. 26వ తేదీ నుంచి నెలాఖరు వరకు 65 ఏళ్లు పైబడిన వారు, మంచంపై నుంచి కదల్లేని దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం డీలర్లు, సేల్స్‌మెన్‌లు పంపిణీని ప్రారంభించారు.
- జిల్లా పరిధిలోని పాలకొండ డివిజన్‌లో పాలకొండ, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాంలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. పార్వతీపురం డివిజన్‌లో పార్వతీపురం, మక్కువ, పాచిపెంట, సాలూరులో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. పాలకొండ, పార్వతీపురం, మక్కువలో ఏఎంసీ గోడౌన్లు, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, సాలూరు జీసీసీ గొడౌన్లు, సీతంపేటలో సివిల్ సప్లైస్ గొడౌన్, పాచిపెంట ప్రైవేట్ గోడౌన్‌లో ఈ ఎంఎల్ ఎస్ పాయింట్లు నడుస్తున్నాయి. పాలకొండ, సీతంపేట, పార్వతీపురం, మక్కువ, పాచిపెంట ఎంఎల్‌ఎస్ సివిల్ సప్లైస్ కంట్రోల్‌లో ఉండగా, సాలూరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురంలు జీసీసీ కంట్రోల్‌లో ఉన్నాయి.
పకడ్బందీగా చేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచంపై నుంచి కదల్లేని దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నాం. రేషన్ డీలర్లు, సేల్స్‌మెన్‌లు ఇంటింటికీ వెళ్లి వారి బయోమెట్రిక్ తీసుకొని రేషన్ ఇస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించాం.
- కె.శ్రీనివాసన్, డీఎం, సివిల్ సప్లైస్ , పార్వతీపురం మన్యం