Share News

Josh in Autodrivers ఆటోడ్రైవర్లలో జోష్‌

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:57 AM

Josh in Autodrivers ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేలు శనివారం జమ చేయనుంది. ఇటీవల స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Josh in Autodrivers ఆటోడ్రైవర్లలో జోష్‌

ఆటోడ్రైవర్లలో జోష్‌

నేడు వారి ఖాతాలో జమకానున్న రూ.15 వేలు

జిల్లా వ్యాప్తంగా 16,312 మందికి లబ్ధి

‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి ఏర్పాట్లు

రాజాం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేలు శనివారం జమ చేయనుంది. ఇటీవల స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు ఉపాధి లేకుండా పోతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందారు. గమనించిన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లను తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. అందులో భాగంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రకటించారు. అర్హులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి వారి ఖాతాల్లో శనివారం రూ.15 వేల చొప్పున నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విజయవాడలో సీఎం చంద్రబాబు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అదనపు సాయం..

జిల్లాలో 16,312 మంది ఆటో డ్రైవర్లు, మ్యాక్సి, మ్యాక్సికాబ్‌ డ్రైవర్లు అర్హులుగా తేలింది. మూడు చక్రాల వాహనాలన్నింటికీ వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహన మిత్ర పేరుతో పథకాన్ని అమలుచేశారు కానీ ఏడాదికి రూ.10 వేలు మాత్రమే అందించేవారు. ఇప్పుడు మోటార్‌ క్యాబ్‌, మ్యాక్సి క్యాబులకు సైతం వర్తింపజేశారు. దీంతో అదనంగా ఓ 500 మంది వరకూ సాయం అందనుంది. అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలోనే 5 వేల వరకూ ఆటోలు ఉన్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం నేపథ్యంలో ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం తొలుత మార్గదర్శకాలను జారీచేసింది. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. సాంకేతిక తప్పిదాలను సరిచేసి ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తిచేసి రవాణా శాఖ స్ర్కూట్నీ తరువాత అర్హులను తేల్చారు. వారందరి ఖాతాల్లో శనివారం నుంచి నిధులు జమ కానున్నాయి.

గ్రీన్‌ట్యాక్స్‌ సైతం తగ్గింపు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.10 వేలు చొప్పున ఇచ్చిన సాయం ఆటోల మరమ్మతులకు సరిపోయేది. అప్పట్లో రహదారులు దారుణంగా ఉండేవి. ప్రభుత్వం అందించే మొత్తం ఎటూ సరిపోయేది కాదు. దీనికితోడు గ్రీన్‌ట్యాక్స్‌ పేరిట భారీగా వసూళ్లు చేపట్టేవారు. నాడు రూ.20 వేలు చొప్పన గ్రీన్‌ ట్యాక్స్‌ ఉండేది. దానిని రూ.3 వేలకు తగ్గించడమే కాదు..గ్రామీణ రహదారులు కొంతవరకూ బాగుచేశారు. దీంతో అటు పన్నుల పరంగా కూడా ఉపశమనం దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం అందించిన దానికంటే రూ.5 వేలు అదనంగా అందనుంది. అర్హత ఉండి రాకుంటే వారి కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటుచేశారు.

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంతో ఉపాధి కోల్పోయాం. కనీసం ఆటో ఈఎంఐలు కట్టేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.15 వేలు వంతున సాయం కొండంత అండ. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.

కోటి, ఆటో డ్రైవర్స్‌ యూనియాన్‌ అధ్యక్షుడు, రాజాం

జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం స్థానిక మోసానిక్‌ టెంపుల్‌ ప్రాంగణంలో శనివారం నిర్వహిస్తామని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 16312 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.

---------------

Updated Date - Oct 04 , 2025 | 12:57 AM