Built a Bridge of Sticks! చేయి చేయి కలిపారు.. కర్రల వంతెన నిర్మించారు!
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:03 PM
Joined Hands.. Built a Bridge of Sticks! మక్కువ, సీతానగరం మండలాలకు చెందిన కొత్తూరు-బల్లకృష్ణాపురం గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో ఆ ప్రాంతవాసులు ఆదివారం చేయి చేయి కలిపి వీఆర్‌ఎస్ కాలువపై కర్రల వంతెన నిర్మించుకున్నారు.
మక్కువ రూరల్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మక్కువ, సీతానగరం మండలాలకు చెందిన కొత్తూరు-బల్లకృష్ణాపురం గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో ఆ ప్రాంతవాసులు ఆదివారం చేయి చేయి కలిపి వీఆర్‌ఎస్ కాలువపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. వాస్తవంగా ఆ రెండు గ్రామాల ప్రజల రాకపోకలకు వీలుగా రెండున్నర కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.కోటీ 60 లక్షలు మంజూరు చేసింది. పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద కొద్దిరోజుల పాటు పనులు చేపట్టారు. అయితే ఇంతలో వర్షాలు జోరందుకోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా ఈ రెండు గ్రామాల మధ్యన వీఆర్‌ఎస్ కాలువపై వంతెన నిర్మాణానికి మరో రూ.40 లక్షలతో అధికారులు టెండర్లు పిలిచారు. అయితే ఈ లోపుగా కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేయడంతో పనులు చేపట్టలేదు. మరోవైపు ఆయా గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వారు వీఆర్‌ఎస్ కాలువపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మించుకున్నారు. తమ గ్రామాల నుంచి ఎక్కడి వెళ్లాలన్నా.. ఇదే కీలక మార్గమని, దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా.. వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు.