'Swachh Parvathipuram' ‘స్వచ్ఛ పార్వతీపురం’లో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:47 PM
Join the 'Swachh Parvathipuram' Initiative స్వచ్ఛ పార్వతీపురంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు.

పార్వతీపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ పార్వతీపురంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌సీఎం వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ప్లకార్డులు చేతపట్టి.. స్వచ్ఛతపై ప్రజలను చైతన్య పర్చాలని తెలిపారు. అనంతరం ఆర్‌సీఎంలో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో టి.కొండలరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, డీఎల్‌డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి
అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా, చెరువుల చుట్టూ, గ్రామాల్లో మొక్కల పెంపకానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సీడ్‌బాల్స్ తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, వనసంరక్షణ సమితుల ద్వారా ప్లాంటేషన్ పనులను చేప ట్టాలని సూచించారు. తాత్కాలిక హోల్డింగ్ ఏరియా ఏర్పాటుపై దృష్టిసారించాలని స్పష్టం చేశారు. జిల్లాలో చిత్తడి నేలల సరిహద్దులు, వాటి నోటిఫికేషన్‌పై సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అర్తం, నగరవాటిక వద్ద నగర వనాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసినట్టు డీఎఫ్‌వో ప్రసూన తెలిపారు. పంటనష్ట పరిహారాన్ని విడుదల చేశామని వెల్లడించారు.
ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలి..
జిల్లాలో ఏటా ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డికి మంచి గిరాకీ ఉందని, దాని సాగుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాగులో ఏటా 15 శాతానికి మించి వృద్ధి సాధించాలని, పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మత్స్యసంపద వృద్ధికి జిల్లా అనుకూలమని, 58 శాతం నీటి వనరులు ఉన్నాయని గుర్తు చేశారు.