Share News

Jindal's eye on Tatipudi reservoir..! తాటిపూడి జలాశయంపై జిందాల్‌ కన్ను..!

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:59 PM

Jindal's eye on Tatipudi reservoir..! జిందాల్‌ పరిశ్రమకు భూసేకరణ సమయంలో గోదావరి ఇండస్ట్రీయల్‌ వాటర్‌ ప్రాజెక్టు వాటా నుంచి పరిశ్రమకు నీటిని సరఫరా చేసేందుకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవిఎంసీ) అంగీకరించిందని చెప్పిన జిందాల్‌ యాజమాన్యం ఇప్పుడు నిర్మించతలపెట్టిన ఎంఎస్‌ఎంఈ పార్కులకు తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీటిని కావాలని కోరడంపై ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Jindal's eye on Tatipudi reservoir..! తాటిపూడి జలాశయంపై   జిందాల్‌ కన్ను..!
శృంగవరపుకోట నియోజకవర్గ గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చే తాటిపూడి రిజర్వాయర్‌ సంప్‌

తాటిపూడి జలాశయంపై

జిందాల్‌ కన్ను..!

ఎంఎస్‌ఎంఈ పార్కులకు నీటి సరఫరాకు ప్రతిపాదన

ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు

భవిష్యత్‌లో తాగు, సాగునీటికి ఇబ్బందులుంటాయనే

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్న వైనం

గోదావరి జలాలను కేటాయించినట్లు గతంలో యాజమాన్యం ప్రకటన

నాడు...

శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి గ్రామాల పరిధిలో రూ.4వేల కోట్లతో జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం శుద్ధి కర్మాగారం (రిఫైనరీ, విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌) నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 8 ఎంజీడి (రోజుకు మిలియన్‌ గ్యాలన్స్‌) నీటిని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) గోదావరి ఇండస్ట్రీయల్‌ వాటర్‌ ప్రాజెక్టు నుంచి కేటాయించింది.

ఇదీ 2007 జూన్‌ 4న స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయం వద్ద జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సదస్సులో జిందాల్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాచస్పతి చేసిన ప్రకటన

గత ప్రభుత్వంలో..

ఏడాదికి 1.4 టన్నుల సామర్థ్యం కలిగిన అల్యూమినియం రిఫైనరీ కాంప్లెక్స్‌, 90 మెగావాట్ల కోజనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 985.70 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్‌ ఇనీషియేటివ్‌ (పచ్చదనం కోసం చొరవ) చేపడుతున్న ఈ ప్రభుత్వం బాక్షైట్‌ తవ్వకాలకు ముందుకు వెళ్లకూడదని నిర్ణయించింది. అందువల్ల అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయలేకోతున్నాం. ప్రత్యామ్నాయంగా బహుళ వినియోగ ఎంఎస్‌ఎంఈ పార్కు, ఇతర అనుకూల పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాం. తాటిపూడి జలాశయం నుంచి నీటిని కేటాయించాలి.

- ఇది 2023 ఫిబ్రవరి 20న మెస్సర్స్‌ జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం( జిందాల్‌ యాజమాన్యం) నుంచి పరిశ్రమలు, వాణిజ్య శాఖకు అందిన ప్రతిపాదన

శృంగవరపుకోట, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

జిందాల్‌ పరిశ్రమకు భూసేకరణ సమయంలో గోదావరి ఇండస్ట్రీయల్‌ వాటర్‌ ప్రాజెక్టు వాటా నుంచి పరిశ్రమకు నీటిని సరఫరా చేసేందుకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవిఎంసీ) అంగీకరించిందని చెప్పిన జిందాల్‌ యాజమాన్యం ఇప్పుడు నిర్మించతలపెట్టిన ఎంఎస్‌ఎంఈ పార్కులకు తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీటిని కావాలని కోరడంపై ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలత చెందుతున్నారు. ఇదే విషయంపై జిందాల్‌ భూ నిర్వాసితులు, రైతులు కలిసి గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు.

ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈ పార్కులు నిర్మించాలనుకుంటున్న భూములకు తాటిపూడి రిజర్వాయర్‌ కూతవేటు దూరంలో గంట్యాడ మండల పరిధిలో ఉంది. మహా విశాఖ నగరానికి తాగునీరు అందించేందుకు 1963-1968 మధ్యకాలంలో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. మరోవైపు ఎస్‌.కోట, జామి, గంట్యాడ మండలాల పరిధిలోని 35 గ్రామాల్లో 15,378 ఎకరాలకు సాగునీరు కూడా అందుతోంది. ఇంకోవైపు ముషిడిపల్లి వద్ద నిర్మించిన ఊటబావుల ద్వారా విజయనగరం కార్పొరేషన్‌కు కూడా నీరు సరఫరా అవుతోంది. వీటన్నింటితో పాటు తాటిపూడి జలాశయం సమీపంలో నిర్మించిన సంప్‌ ద్వారా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని ఎస్‌.కోట, వేపాడ, ఎల్‌.కోట, కొత్తవలస, జామి మండలాల్లోని 99 గ్రామాలకు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 181 గ్రామాలకు కూడా తాగునీరు అందించేందుకు గ్రామీణ తాగునీటి శాఖ పనులు చేపడుతోంది. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ జలాశయమే దిక్కు. దీనిపైనే గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని గంట్యాడ మండలానికి చెందిన పలు గ్రామాలు తాగునీటికి ఆధారపడుతున్నాయి. మహా విశాఖనగర ప్రజల తాగునీటి అవసరాలు పోను ఈ మూడు మండలాల సాగునీటి అససరాలు తీర్చేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు కాలక్రమంలో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలనూ తీర్చాల్సి వస్తుంది.

అరకొరగా నీటి సరఫరా

ఇప్పటికే విజయనగరం నగరపాలక సంస్థతో పాటు శృంగంరపుకోట నియోజకవర్గానికి అరకొర నీటి సరఫరా జరుగుతోంది. ఒక రోజు ఇస్తే మరో రెండు రోజులు పంపిణీ చేయడం లేదు. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి అమలు చేసేందుకు మనిషికి 50లీటర్ల నీరు అవసరం. అరకు, అనంతగిరి కొండల్లో పడిన వర్షాల ఆధారంగా ఈ రిజర్వాయర్‌ నిండుతుంది. కొండల మధ్య నుంచి వచ్చిన వరద నీరు గోస్తనీ నది ప్రవాహం ద్వారా ఇందులో చేరుతుంది. ఓ ఏడాది బాగా వర్షాలు పడితే మరో ఏడాది వర్షాలు ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వాయర్‌లో అనుకున్న స్థాయిలో నీరు చేరకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకనే జిందాల్‌ భూముల్లో ప్రాతిపాదిస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కులకు తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి యాజమాన్యం నీటిని అడగడం ఈ ప్రాంత ప్రజలకు రుచించడం లేదు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తాటిపూడి జలాశయ సాగునీటి రైతులు కూడాకలెక్టర్‌ను కలిసేందుకు చూస్తున్నారు. తాటిపూడి నీటిని జిందాల్‌ ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈ పార్కులకు సరఫరా చేసేందుకు అంగీకరించవద్దని కోరనున్నారు. ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఉద్యమించేందుకు జిందాల్‌ భూనిర్వాసితులతో పాటు రైతులు సంఘటితమవుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:59 PM