Share News

ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి జిందాల్‌ సమస్య

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:13 AM

2008లో జిందాల్‌ గ్రూప్‌కు చెందిన అల్యూమినియం రిఫైనరీ ప్రాజెక్టు కోసం ఎస్‌.కోట మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి 866.67 ఎకరాల అసైన్డ్‌ భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించింది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి జిందాల్‌ సమస్య
జిందాల్‌ అల్యూమినియం పరిశ్రమకు కేటాయించిన భూములు ఇవే

- ఆశ్రయించిన ఎమ్మెల్సీ రఘురాజు

- హైకోర్టులోనూ పిల్‌ వేసిన భూనిర్వాసితులు

- జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా ప్రయత్నాలు

- స్థానికంగా కూడా కొనసాగుతున్న నిరసనలు

- ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణంపై ప్రభావం

శృంగవరపుకోట ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి):

- 2008లో జిందాల్‌ గ్రూప్‌కు చెందిన అల్యూమినియం రిఫైనరీ ప్రాజెక్టు కోసం ఎస్‌.కోట మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి 866.67 ఎకరాల అసైన్డ్‌ భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించింది. నిర్వాసితులకు పరిహారం, ఉపాధి, వాటాలు, గృహా నిర్మాణం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తామని జిందాల్‌ యాజమాన్యం హమీ ఇచ్చింది. ద్రవ్య పరిహారం పాక్షికంగా చెల్లించినప్పటికీ ఉద్యోగాలు, గృహా నిర్మాణాలు, వాటాలు వంటి హామీలు నెరవేరలేదు. 15 ఏళ్లు గడిచిన ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి నిర్వాసిత రైతులు అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. భూసేకరణ చట్టం 2013 పీసా (పీఈఎస్‌ఏ) చట్టం, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. బాధిత రైతులకు న్యాయం చేయడానికి, వారికి రక్షణ కల్పించడానికి తక్షణ విచారణ జరపాలి.

- ఈనెల 4న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టిలో పెట్టిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

- జిందాల్‌ అల్యూమినియం శుద్ధికర్మాగార స్థాపన కోసం భూములను ఇచ్చాం. దానిని మరే ఇతర ప్రయోజనాల కోసం ఎప్పటికీ ఉపయోగించకూడదు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద అన్ని బాధ్యతలను యాజమాన్యం నెరవేర్చాలన్న ఒడంబడిక ఉంది. 15 ఏళ్లుగా పరిశ్రమను నిర్మించకపోవడంతో భూములు వృథాగా ఉన్నాయి. ఈ భూముల్లో ప్రతిపాదిత పరిశ్రమకు ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఇతర పరిశ్రమల నిర్మాణానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని జిందాల్‌ యాజమాన్యం అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. కానీ, భూమి, ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందించడాన్ని మర్చిపోయింది. ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం లేఅవుట్లు వేయడానికి, ప్లాట్లుగా విక్రయించాలని చూస్తుంది. ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా కనిపిస్తుంది. విచారించి మా భూములను మాకు తిరిగి ఇప్పించండి.

- ఈనెల 4న హైకోర్టులో పిల్‌ వేసిన కొంతమంది జిందాల్‌ భూ నిర్వాసితులు

జిందాల్‌ భూ సమస్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టికి వెళ్లింది. నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. మరోపక్క ఇదే అంశంపై కొందరు నిర్వాసిత రైతులు కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ‘మా భూములు మాకు ఇప్పించాలని’ పిల్‌ వేశారు. దీంతో ఈ అంశంపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చర్చ నడుస్తోంది. అలాగే, గత యాభై రోజులుగా నిర్వాసిత రైతులు వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముందుకెళ్తున్న ప్రభుత్వం..

కూటమి ప్రభుత్వం లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఎక్కడ స్థలం అందుబాటులో ఉంటే అక్కడ పరిశ్రమలను నిర్మించడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తుంది. ఇందులో భాగంగా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, చీడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల్లో గతంలో జిందాల్‌ కోసం సేకరించిన భూముల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు జీవనోపాధి కల్పించాలని చూస్తుంది. అయితే, జిందాల్‌ యాజమాన్యం గత వైసీపీ ప్రభుత్వంలోనే ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. రూ.3,970 కోట్ల పెట్టుబడితో పది రకాల ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి తద్వారా 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత వైసీపీ ప్రభుత్వానికి చెప్పింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయినందున, దాన్ని అలాగే కొనసాగించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జిందాల్‌ యాజమాన్యం కూడా అంగీకారం తెలిపింది. దీంతో రెండు నెలల కిందట ఈ భూముల్లో ఉన్న తుప్పలు, డొంకల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.

రోడ్డెక్కిన నిర్వాసితులు

జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిర్వాసితులు రోడ్డెక్కారు. 50 రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. గతంలో ప్రతిపాదించిన అల్యూమినియం లిమిటెడ్‌ పరిశ్రమకు బదులుగా ఇండస్ట్రీయల్‌ పార్కులకు భూములను ఇవ్వాలని చూడడం రైతులను మోసం చేయడమేనంటూ ఆగ్రహిస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా, తమ దగ్గర తీసుకున్న భూములతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు యాజమాన్యం చూస్తుందని ఆరోపిస్తున్నారు. దీంతో పోలీస్‌ శాఖ సెక్షన్‌ 30ను అమల్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిందాల్‌ భూముల వద్ద భద్రత పెంచేసింది. అయినప్పటికీ నిర్వాసిత రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇంతజరుగుతున్నా జిందాల్‌ యాజమాన్యం చర్చలు జరపకపోవడంతో ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా నిర్వాసితులు చూస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌హెచ్‌ఆర్‌సీ, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు సంబంధిత యాజమాన్యాలు జంకుతున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్లు భోగట్టా.

Updated Date - Aug 09 , 2025 | 12:13 AM