Share News

జయ జయ జగన్నాథ

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:26 PM

Jaya Jaya Jagannatha జిల్లావ్యాప్తంగా శుక్రవారం రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర సాగింది. అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. శుక్రవారం పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.

జయ జయ జగన్నాథ
పార్వతీపురంలో భక్తుల నడుమ సాగుతున్న రథయాత్ర

  • స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

పార్వతీపురం టౌన్‌, జూన్‌27 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర సాగింది. అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. శుక్రవారం పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయంలో పూజలు అయ్యాక స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై వేంచేయించారు. జిల్లా కేంద్రంలో దంగడి వీధిలోని ప్రధాన ఆలయం వద్ద స్వామివారికి విశేష పూజలు చేశారు. పట్టణవాసులు జగన్నాథుడిని దర్శించుకుని పులకించిపోయారు. అనంతరం పాతబస్టాండ్‌ కూడలి వద్ద నుంచి గుడించా మందిరం వరకు జగన్నాథ రథోత్సవం కనుల పండువగా సాగింది. జై జగన్నాథ్‌ అంటూ భక్తులు రథం వెంట నడిచారు. గుడించా మందిరంలో వచ్చే నెల 5వ తేదీ వరకు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఈవో ప్రసాద్‌ తెలిపారు. ఈనెల 1న హీరాపంచమిని పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. మారురథ యాత్ర రోజున జగన్నాథ స్వామిని తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లా కేంద్రంలో నిర్వహిచిన జగన్నాథ రథయాత్రలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రథయాత్ర ప్రారంభానికి ముందు స్వామి వారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. అనంతరం రథాన్ని లాగి అందరిన్నీ ఉత్సాహపరిచారు. అయన వెంటఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:26 PM