Share News

ivrs call ‘కాల్‌’కలం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:06 AM

ivrs call గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై నిఘా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కొన్ని లోపాల కారణంగా పంచాయతీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఒక గ్రామానికి రావాల్సిన ఫోన్లు మరొక గ్రామానికి వెళ్తున్నాయి.

ivrs call ‘కాల్‌’కలం

‘కాల్‌’కలం

ఐవీఆర్‌ఎస్‌ ఫోన్లతో కార్యదర్శులు, గ్రీన్‌ అంబాసిడర్లకు తిప్పలు

చెత్తను సేకరిస్తున్నా పని చేయడం లేదని నివేదికలు

ఐవీఆర్‌ఎస్‌తో సంబంధం లేని గ్రామాలకు ఫోన్‌ వెళ్లడమే కారణం

ఇబ్బంది పడుతున్న క్షేత్రస్థాయి సిబ్బంది

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై నిఘా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కొన్ని లోపాల కారణంగా పంచాయతీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఒక గ్రామానికి రావాల్సిన ఫోన్లు మరొక గ్రామానికి వెళ్తున్నాయి. దీనివల్ల కష్టబడుతున్నా ఉన్నతాధికారులు ఆగ్రహిస్తున్నారని కార్యదర్శులు, గ్రీన్‌ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది.

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):

ఎస్‌.కోట మండలం అలుగుబిల్లి గ్రామాన్ని ఐవీఆర్‌ఎస్‌ గ్రామంగా అధికారులు ఎంపిక చేశారు. దీంతో ఈ గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రతిరోజూ స్థానికులకు ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి. గ్రీన్‌ అంబాసిడర్లు నిత్యం ఇంటింటా చెత్తను సేకరించి చెత్త సంపద తయారీ కేంద్రంలో వేస్తున్నారు. ఈ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 6 గంటలకు గ్రామానికి వచ్చి 7.30 వరకూ ఉండి గ్రీన్‌ అంబాసిడర్లు తెచ్చే చెత్త బండితో ఫొటో తీసి ఐవీఆర్‌ఎస్‌ గ్రూపులో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయినా కూడా ఈ గ్రామానికి సంబంధించి 21 ఫోన్‌కాల్స్‌ రాగా వాటిలో ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతోందని 60 శాతం మంది, జరగలేదని 40 శాతం మంది ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో చెప్పారు. అలాగే వారానికి కనీశం రెండుసార్లు అయినా చెత్త సేకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు అవునని 76 శాతం, కాదని 23 శాతం చెప్పినట్లు నివేదిక వెళ్లింది. దీంతో కార్యదర్శితో పాటు గ్రీన్‌ అంబాసిడర్లకు ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. పనిచేస్తున్నా చేయడం లేదని ఉన్నతాధికారులు అనడంతో అయోమయంలో పడ్డారు. కాగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ అలుగుబిల్లి గ్రామంతో పాటు ఇదే సచివాలయం పరిధిలో ఉన్న చామలాపల్లికి కూడా వెళ్తుండడమే దీనికి కారణం. చామలాపల్లి ఐవీఆర్‌ఎస్‌ పరిధిలో లేదు. కానీ ఫోన్‌ కాల్స్‌ రెండు గ్రామాలకూ వెళ్తున్నాయి. చామలాపల్లి వాసులు భిన్నంగా చెబుతుండడంతో అలుగుబిల్లి గ్రీన్‌ అంబాసిడర్లు, పంచాయతీ కార్యదర్శి ఇబ్బంది పడుతున్నారు.

- గంట్యాడ మండలం సిరిపురం సచివాలయం పరిధిలో మురపాక గ్రామం ఉంది. సిరిపురం ఐవీఆర్‌ఎస్‌ గ్రామంగా ఎంపిక చేశారు. కానీ మురపాక గ్రామానికి చెందిన వారికి కూడా ఫోన్‌ కాల్స్‌ వెళ్లడంతో ఐవీఆర్‌ఎస్‌లో సరైన సమాధానం రావడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి, గ్రీన్‌ అంబాసిడర్లు పనిచేయనట్లు ఉన్నతాధికారులు చిర్రుబుర్రులాడుతున్నారు.

ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఉంది. పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ ఎలా జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రభుత్వం జూన్‌ నుంచి ఐవీఆర్‌ఎస్‌(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం) విధానం అమలులోకి తీసుకువచ్చింది. జిల్లా వ్యాప్తంగా 213 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ గ్రామాలను ముందుగా ఎంపీడీవోలు ఎంపిక చేసి జాబితా పంపించారు. ఈ గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోందా? లేదా? అలాగే కనీసం వారానికి రెండు సార్లు అయినా చెత్త సేకరిస్తున్నారా? లేదా ? అనే రెండు ప్రశ్నలతో ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. సేకరణ జరిగితే ఫోన్‌లో ఒకటి అని బటన్‌ ప్రెస్‌ చేయాలని, లేదంటే రెండు అంకె బటన్‌ నొక్కాలని చెబుతుంది. ఇక్కడ వరకూ బాగే ఉంది అయితే సచివాలయం పరిఽధిలో ఉన్న అన్ని గ్రామాలు ఐవీఆర్‌ఎస్‌ గ్రామాలు కావు. ఫోన్లు మాత్రం ఆ గ్రామాలకూ వెళ్తున్నాయి. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోయినా రెండో ఆప్షన్‌ నమోదవుతోంది. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులకు, ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌కు మధ్య తేడా కన్పిస్తోంది. వాస్తవానికి ప్రతి ఐవిఆర్‌ఎస్‌ గ్రామాల్లో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 గంటలకే గ్రామాలకు వచ్చి గ్రీన్‌ అంబాసిడర్లతో సెల్ఫీ తీసుకుని ఐవిఆర్‌ఎస్‌ వాట్సప్‌ గ్రూపులో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఎంపీడీవోలు, డీఎల్‌పివోలు, డీపీవోలు పర్యవేక్షిస్తున్నారు. మహిళా కార్యదర్శులు కూడా ఉదయం 6 గంటలకు వారు పని చేసే గ్రామాలకు రావడం కాస్త కష్టం అవుతుంది. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి మల్లిఖార్జున వద్ద ప్రస్తావించగా ఐవీఆర్‌ఎస్‌ విధానం రాష్ట్ర స్థాయిలో తీసుకున్నదని, ఐవిఆర్‌ఎస్‌ గ్రామాల్లో నిత్యం పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు.

Updated Date - Nov 29 , 2025 | 12:06 AM