Celebrations.. వేడుకలకు వేళాయే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:33 PM
It’s Time for Celebrations.. జిల్లా అంతటా దసరా సందడి మొదలైంది. సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ప్రముఖ అమ్మవారి ఆలయాలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
ముస్తాబవుతున్న అమ్మవారి ఆలయాలు
నిజరూప దర్శనమివ్వనున్న కోటదుర్గమ్మ
భారీగా తరలిరానున్న భక్తులు
పాలకొండలో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు : డీఎస్పీ రాంబాబు
పాలకొండ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా దసరా సందడి మొదలైంది. సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ప్రముఖ అమ్మవారి ఆలయాలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. శంబర పోలామంబ దేవాలయంలో ప్రత్యేక పూజలకు సర్వం సిద్ధం చేశారు. ఇక పాలకొండ కోటదుర్గమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. దసరా వేడుకలను అత్యంత వైభవంగా జరిపేందుకు అందరూ సహకరించాలన్నారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ‘అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి అక్టోబరు 2 వరకు జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నాం. 21వ తేదీ సాయంత్రం నుంచి అక్టోబరు 3వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. నిజరూప దర్శనం నుంచి విజయ దశమి తిరువీధి పూర్తయ్యేంతవరకు రోజూ బందోబస్తు కొన సాగుతుంది. పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సీసీ, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.’ అని తెలిపారు.
భారీ వాహనాలు ఇలా..
‘ ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే భారీ వాహనాలు పార్వతీపురం మీదుగా పాలకొండ కార్గిల్ జంక్షన్ వైపు నుంచి రాజాం, చిలకపాలెం మీదుగా మళ్లిస్తాం. శ్రీకాకుళం నుంచి రాయగడ వైపు వెళ్లే వాటిని చిలకపాలెం రాజాం, రామభద్రపురం, పార్వతీపురం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి కొత్తూరు, సీతంపేట వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు పాతపట్నం, కొత్తూరు వైపుగా మళ్లిస్తాం. రాయగడ నుంచి కొత్తూరు వెళ్లాల్సిన వాటిని కురుపాం, ఎల్విన్‌పేట, బత్తిలి వైపు , విజయనగరం నుంచి బత్తిలి, కొత్తూరు వెళ్లాల్సిన భారీ వాహనాలను పార్వతీపురం, కురుపాం, ఎల్విన్‌పేట మీదుగా మళ్లిస్తాం.’ అని డీఎస్పీ వెల్లడించారు.
పాలకొండ టౌన్‌లో...
‘రాజాం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఫోర్‌వీలర్స్, ద్విచక్ర వాహనాలు అన్నవరం జంక్షన్, అన్నవరం గ్రామం, వడమ, వడమ జంక్షన్ మీదుగా మళ్లిస్తాం. వీరఘట్టం వైపు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వచ్చే వాహనాలు కార్గిల్ జంక్షన్ వద్ద నుంచి అన్నవరం జంక్షన్, అన్నవరం గ్రామం వడమ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజాం, వీరఘట్టం వైపు , శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు , పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లాల్సిన వాహనాలు యథావిధంగా నడుస్తాయి.’ అని డీఎస్పీ తెలిపారు.
పార్కింగ్ స్థలం ఏర్పాటు...
రాజాం వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశాం. శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వాటికి ఆర్టీవో కార్యాలయం పక్కన , వీరఘట్టం వైపు నుంచి వచ్చే వాహనాలకు వీరఘట్టం జంక్షన్ వద్ద ఖాళీ స్థలంలో పార్కింగ్ ఇచ్చాం. సీతంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు ఆర్డీవో కార్యాలయం వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమా వేశంలో సీఐ ఎ.ప్రసాదరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి పాల్గొన్నారు.
శంబరలో..
మక్కువ రూరల్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ దేవాలయంలో ఈ నెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయం కార్యనిర్వాహణాధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా రోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు , విశేష హోమాలు చేస్తామని తెలిపారు. ప్రత్యేక అలంకరణలో పోలమాంబ దర్శనమివ్వనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.