మళ్లీ వాన గండం
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:59 PM
అన్నదాతను వరుణుడి గండం వీడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
- మారిన వాతావరణం
- రెండు రోజులుగా మబ్బులు
-ముమ్మరంగా వరి కోతలు
- పంటలపై అన్నదాతల్లో
పాలకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అన్నదాతను వరుణుడి గండం వీడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనడం, జిల్లాలోని వాతావరణ పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉండడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు సేన్యార్ తుఫాన్ ప్రభావం కూడా ఉండవచ్చునని, ఇది డిసెంబరు 2 వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంటుంది. దీంతో అన్నదాతల్లో మరింత ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ కింద రెండు లక్షలకు పైగా ఎకరాల్లో వరి, పత్తి, ఇతర వాణిజ్య పంటలను రైతాంగం సాగు చేస్తుంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపడుతున్న సమయంలోనే వరుణుడి గండం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా రైతాంగం వణుకుతుంది.
ముమ్మరంగా వరికోతలు..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 50 శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయి. వాటిలో 30 శాతం వరకు కుప్పలు రూపంలో వేయగా, మరో 20 శాతం వరి పనలు (ఓదెలు) రూపంలో పంట పొలాల్లోనే ఉన్నాయి. అలాగే మరో 50 శాతం వరకు పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మబ్బుల వాతావరణం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలులు వీచినా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఖరీఫ్ పంట చేతికి అందుతున్న సమయంలోనే తుపాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు అన్నదాతను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.