చిరుజల్లులతో సరి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:25 AM
ఒకటి రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది.
- జిల్లాలో కురవని భారీ వర్షాలు
- 27 మండలాల్లో లోటు వర్షపాతం
- ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆందోళన
విజయనగరం కలెక్టరేట్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఒకటి రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. కానీ, ఒక్కరోజు కూడా భారీ వర్షం పడలేదు. అంతా చిరుజల్లులే కురిశాయి. ఈ పది రోజులూ దట్టమైన మేఘాలు ఏర్పడడం.. చిన్న జల్లులు పడి ఆగిపోవడం కనిపించింది. దీంతో జిల్లాలో లోటువర్షపాతం నెలకొంది. ఫలితంగా వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఖరీఫ్ సాగు కష్టమేననని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు రావడంతో మే నెల చివరి వారంలో జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో గతానికి భిన్నంగా మేలో అధిక వర్షపాతం నమోదైంది. జూన్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. రోజూ మేఘావృతం కావడం.. ఆనక వర్షాలు ముఖం చాటేయడం పరిపాటిగా మారింది. గత నెలలో 112.1 మిల్లీ మీటర్లు వర్షం కురవాలి. కానీ, 97.4 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. 13 మిల్లీ మీటర్ల లోటు వర్ష పాతం నమోదైంది. జూన్‌లో లక్కవరపుకోట మండలంలో 88 శాతం, వేపాడలో 58.2శాతం, మెంటాడ మండలంలో 56.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మిగిలిన 27 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఈ నెలలో ఇంకా సరైన వానలు పడలేదు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారంలోనే వరి విత్తనాలు చల్లుకునేందుకు అనుకూలం. కానీ, గత పదిరోజులుగా చిరు జల్లులు కురవడంతో పొలాలు బురదగా మారాయి. దీంతో రైతులు వరి విత్తనాలు చల్లుకోలేకపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష హెక్టార్లలో వరి పంట వేసేందుకు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 40 వేల హెక్టార్లకు సంబంధించి మాత్రమే వరినారు పోశారు. ఇప్పటివరకు 46 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశారు. మరో నాలుగు వేల క్వింటాళ్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు వారాల్లో వరి ఆకుమడులు అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ లెక్కన ఈ ఏడాది ఆగస్టు వరకూ ఉభాలు జరిగే పరిస్థితి లేదు.