Share News

ఇట్టే పట్టిస్తుంది!

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:18 AM

ఇకనుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీపాలిష్‌ చేస్తామంటే కుదరదు. రసాయనాలతో కూడి ర్యాపిడ్‌ కిట్లు వచ్చేశాయి.

ఇట్టే పట్టిస్తుంది!
ర్యాపిడ్‌ టెస్టు కిట్లు

- రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట

- పౌరసరఫరా అధికారుల చేతికి ర్యాపిడ్‌ కిట్లు

- వాటితో పరీక్షలు

- బియ్యం అక్రమమని తేలితే కేసులు

రాజాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీపాలిష్‌ చేస్తామంటే కుదరదు. రసాయనాలతో కూడి ర్యాపిడ్‌ కిట్లు వచ్చేశాయి. వాటిని ప్రయోగిస్తే బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందినవా? కావా? అన్నది క్షణాల్లో తేలిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరా అధికారులకు రసాయనాలతో కూడిన కిట్లు అందజేసింది. ఎవరైనా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే ఈ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తారు. బియ్యం అక్రమమని తేలితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 1,249 రేషన్‌ డిపోల పరిధిలో 5,71,228 రేషన్‌కార్డులు ఉన్నాయి. 24 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా దాదాపు 8 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రేషన్‌ డిపోల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. 60 శాతం మంది కార్డుదారులు వారి బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 శాతం మంది ఇతర ప్రాంతాలకు వలసపోవడంతో అక్కడే విక్రయిస్తున్నారు. కేవలం 20 శాతం మంది నిరుపేదలు రేషన్‌ బియ్యాన్ని వినియోగిస్తున్నారు. డిపోలకు సరుకు వచ్చిన మరుసటి రోజు దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.18 వరకూ కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లతో ఒప్పందం చేసుకొని వారికి విక్రయిస్తున్నారు. మిల్లర్లు రీపాలిష్‌ చేసి వేర్వేరు బ్రాండ్లకు చెందిన బ్యాగుల్లో బియ్యాన్ని నింపి అమ్ముకుంటున్నారు. విశాఖ, ఒడిశా ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం పౌరసరఫరా అధికారులకు రసాయనాలతో కూడిన ర్యాపిడ్‌ కిట్లు అందజేసింది. జిల్లాలో 12 మంది సివిల్‌ సప్లయ్‌ డీటీలు, యూడీఆర్‌ఐలకు 4, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి రెండు రసాయన కిట్లు అందించారు. మరో కిట్‌ను జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా బియాన్ని రవాణా చేస్తూ పట్టుబడితే ఆయా కిట్లలో ఉన్న రెండు రకాల రసాయనాలను వినియోగించి పరీక్షిస్తారు. అవి ఎరుపు రంగులో మారితే రేషన్‌ బియ్యంగా నిర్ధారిస్తారు. ఆరు నెలల ముందు పంపిణీ చేసిన బియ్యమైనా, రీ పాలిష్‌ చేసినా ఈ రసాయనాలు ఇట్టే గుర్తిస్తాయి. ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

కిట్లు అందించాం..

జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై దృష్టిపెట్టాం. తనిఖీల సమయంలోనే బియ్యం అక్రమమని నిర్ధారించేందుకు రసాయన కిట్లు వచ్చాయి. పౌరసరఫరా లశాఖ తహసీల్దార్లతో పాటు ఆర్‌ఐలకు అందించాం. వారు తనిఖీలు చేపట్టి బియ్యం పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.

-మురళీనాథ్‌, డీఎస్‌వో, విజయనగరం

Updated Date - Nov 15 , 2025 | 12:18 AM