Share News

‘తల’కెక్కించుకోవట్లే!

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:45 PM

హెల్మెట్‌ ధరించాలని పోలీసులు, అధికారులు పదేపదే చెబుతున్నా మారి మాటలను కొందరు ద్విచక్ర వాహన చోదకులు తలకెక్కించుకోవడం లేదు.

 ‘తల’కెక్కించుకోవట్లే!

- ప్రభుత్వ ఆదేశాలు పాటించని ద్విచక్ర వాహనచోదకులు

- హెల్మెట్‌ ధరించకుండానే ప్రయాణాలు

- ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న వైనం

- రెండేళ్లలో 579మంది మృత్యువాత

  • ఈ ఏడాది ఏప్రిల్‌ 6న ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం నగరానికి చెందిన దీర్గా కార్తీక్‌, పండా తరుణ్‌ అనే యువకులు బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. హెల్మెట్‌ ధరించకపోవడంతో తలలు పగిలి ఇద్దరూ చనిపోయారు.

  • గత నెల 17న సారవకోట మండలం బురదకొత్తూరు గ్రామానికి చెందిన జరజాన సమీర్‌ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమీర్‌ మరోవ్యక్తితో కలిసి బైక్‌పై హిరమండలం వెళుతుండగా గెడ్డయ్యపేట వద్ద లారీని ఢీకొట్టాడు. హెల్మెట్‌ ధరించకపోవడంతో సమీర్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

ఇచ్ఛాపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ ధరించాలని పోలీసులు, అధికారులు పదేపదే చెబుతున్నా మారి మాటలను కొందరు ద్విచక్ర వాహన చోదకులు తలకెక్కించుకోవడం లేదు. హెల్మెట్‌ పెట్టుకోకుండానే ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనివల్ల కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. మృతుల్లో యువకులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఏదో చోట ప్రమాదం చోటుచేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది.

రెండేళ్లలో 1,684 ప్రమాదాలు

జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లలో 1,684 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2023లో 810 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 297 మంది చనిపోయారు. 2014లో 874 ప్రమాదాలు చోటుచేసుకోగా 282 మంది మృతి చెందారు. ఆ రెండేళ్లలో 1,925 మంది క్షతగాత్రులయ్యారు. ఎక్కువ మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రమాదాల్లో చనిపోయినట్టు తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్ల వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

చట్టాలు కఠినం చేసినా..

ఈ ఏడాది మార్చి 1 నుంచి హెల్మెట్‌ ధారణకు సంబంధించి కీలక ఆదేశాలు వచ్చాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో కఠిన నిబంధనలు, జరిమానాలు అమల్లోకి వచ్చాయి. అయినా సరే వాహనదారుల్లో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి1 కంటే ముందు హెల్మెట్‌ లేకుండా ప్రయాణానికి సంబంధించి రూ.135 జరిమానా వేసేవారు. ప్రస్తుతమైతే రూ.1000 కట్టాల్సిందే. లైసెన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.10 వేలు వసూలు చేస్తారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగితే కేసులు నమోదుచేస్తారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే బండి సీజ్‌ చేస్తారు.

అపరాధ రుసుం ఇలా..

హెల్మెట్‌ లేకుంటే రూ.వెయ్యి, వెనుక కూర్చున్న వారు హెల్మెట్‌ ధరించకపోతే రూ.వెయ్యి, బైక్‌కు ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.వెయ్యి, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు, భారీ సైలెన్సర్లతో సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడితే రూ.2వేలు, అదే రెండోసారి దొరికితే రూ.4వేలు, పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించుకుంటే మనిషికి రూ.200 లెక్క జరిమానా విధిస్తారు. మైనర్లు డ్రైవింగ్‌ చేసి పట్టుబడితే రూ.వెయ్యి, నిషేధం ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్‌ చేస్తే రూ.1500 నుంచి రూ.2వేలు, బైక్‌ రేసుల్లో పాల్గొంటే రూ.5వేలు, రెండోసారి అందులో దొరికితే రూ.10వేలు, తాగి వాహనం నడిపితే మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పురావడంలేదు.

తప్పనిసరి ధరించాలి..

ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్‌ పెట్టుకోవాలి. కార్లపై వెళ్లేవారు షీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా, జైలుశిక్ష తప్పదు. ప్రజల బాగుకోసమే ఈ ప్రయత్నం. ప్రజలు సహకరించాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.

-మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Jun 18 , 2025 | 11:45 PM