ఇంకా బడికి రావట్లే!
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:27 AM
కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల్లో ఇంకా పచ్చకామెర్ల వ్యాధి భయంపోనట్లు ఉంది.
- కురుపాం గురుకుల బాలికల పాఠశాల పునఃప్రారంభమై వారం గడిచిన వైనం
- 609 మందికి 16 మంది విద్యార్థినులే హాజరు
- వీడని పచ్చకామెర్ల భయం
కురుపాం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల్లో ఇంకా పచ్చకామెర్ల వ్యాధి భయంపోనట్లు ఉంది. పాఠశాల పునఃప్రారంభమై వారం గడిచినా ఇంకా తరగతులకు హాజరుకావడం లేదు. దసరా సెలవుల్లో తీవ్రమైన జాండిస్‌తో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా, మరికొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలకు దసరా నుంచి ఈ నెల 15 వరకు అధికారులు సెలవులను ప్రకటించారు. ఈ నెల 16న పాఠశాలను పునఃప్రారంభించారు. పాఠశాల సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి పంపించాలని కోరారు. ఈ పాఠశాలలో మొత్తం 609 మంది విద్యార్థినులు ఉన్నారు. అయినప్పటికీ ఎవరూ తరగతులకు రావడం లేదు. ఈ నెల 19న కేవలం 31 మందే హాజరు కాగా, దీపావళి కారణంగా వీరిలో సగం మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం పాఠశాలలో కేవలం 16 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. దీంతో అకడమిక్ పరంగా విద్యార్థినులు నష్టపోతున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయలక్ష్మిని వివరణ కోరగా.. తమ సిబ్బంది, ఉపాధ్యాయులు అన్ని గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాతున్నారని, నాగుల చవితి పండుగ తరువాత పిల్లలను పంపిస్తామని వారు చెబుతున్నారని అన్నారు.