భూమార్పిడి కావట్లే!
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:17 AM
జిల్లాలో ఈ ఇద్దరికే కాదు చాలా మంది రైతులకు ఇదే సమస్య ఉంది.
- ఆ బాధ్యతలు రెవెన్యూ శాఖ నుంచి బదలాయింపు
- మండల పరిషత్, మునిసిపాలిటీలకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
- రెండు నెలవుతున్నా జారీకాని జీవో
- ల్యాండ్ కన్వర్షన్ కోసం తప్పని ఎదురు చూపులు
- గంట్యాడ మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన ఓ రైతు తన ఎకరా భూమిలో 40 సెంట్లను వ్యవసాయేతర భూమిగా మార్పు చేయాలనుకున్నాడు. ప్రస్తుతం భూ మార్పిడి (ల్యాండ్ కన్వెర్షన్)పై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు కావడం లేదు. దీంతో ఆయన ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు.
- ఎస్.కోట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన భూమిలో రోడ్డు విస్తరణ జరగనుందనే సమాచారంతో ల్యాండ్ కన్వెర్షన్‌కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. గత రెండు నెలల నుంచి భూమార్పిడిపై స్పష్టత లేకపోవడంతో ఆయన దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు.
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఇద్దరికే కాదు చాలా మంది రైతులకు ఇదే సమస్య ఉంది. భూ మార్పిడిపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో చాలాచోట్ల వివిధ ప్రాజెక్టులు, రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, ఇతర అవసరాలకు సంబంధించి ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. దీంతో తమ భూములు కోల్పోయే అవకాశం ఉండడంతో వాటి విలువను పెంచుకునేందుకు పలువురు రైతులు ల్యాండ్ కన్వెర్షన్ చేసుకోవాలని భావిస్తున్నారు. గతంలో వ్యవసాయ భూమిలో వెంచర్లు వేయాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్నా ముందుగా ల్యాండ్ కన్వెర్షన్ చేసుకునేవారు. సంబంధిత భూమి మార్కెట్ ధర ప్రకారం 5 శాతం ప్రభుత్వానికి చలానా కట్టేవారు. మార్పిడి చేయనున్న భూమికి సంబంధించి మార్కెట్ వాల్యు సర్టిఫికెట్, 1బీ, ఎఫ్‌ఎంబీతో మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోసుకునేవారు. ఈభూమి ప్రైవేటుదా? ప్రభుత్వానిదా?, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా?లేదా? అనేది రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆర్డీవోకు నివేదికలు పంపించేవారు. ఆయన చూసిన తరువాత పత్రాలు అన్ని సక్రమంగా ఉంటే వ్యవసాయేత భూమిగా మార్పు చేస్తూ ధ్రువపత్రం జారీ చేసేవారు. జిల్లాలో ఏడాదికి రెండు వేల ఎకరాలు వరకు భూమార్పిడి జరిగేది. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పటి వరకూ ఈ ప్రక్రియ అంతా రెవెన్యూ శాఖ పరిధిలో జరిగేది. అయితే, రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కన్వెర్షన్‌ను మండల పరిషత్, మునిసిపాలిటీలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. 5 శాతం చలనా ఫీజుగా నిర్ణయించింది. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ పరిస్థితిలో ల్యాండ్ కన్వెర్షన్ చేసే అధికారం తమకు లేదని రెవెన్యూ అధికారులు చెబుతుండగా, భూమి మార్పిడికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి జీవో రాలేదని మండల పరిషత్ అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నారు.