Share News

ఉందిలే మంచికాలం...

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:39 AM

శృంగవరపుకోట.. జిల్లాలో అతిపెద్ద మేజర్‌ పంచాయతీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజన గ్రామాలకు ఆనుకుని ఉన్న ఈ పల్లె పట్టణ తరహాలో కనిపిస్తుంది. దాదాపు యాబై వేల జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ నివశిస్తున్న ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతోంది.

ఉందిలే మంచికాలం...
ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీ

  • పల్లెల్లో పట్టణ తరహా అభివృద్ధి

  • జిల్లాలో ఆరు రూర్బన్‌ పంచాయతీలు

  • పదివేల జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటికి గుర్తింపు

  • మిగిలిన వాటిని 1,2,3 గ్రేడ్‌లుగా విభజన

  • డిప్యూటీ ఎంపీడీవోలకు పాలన బాధ్యతలు

శృంగవరపుకోట.. జిల్లాలో అతిపెద్ద మేజర్‌ పంచాయతీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజన గ్రామాలకు ఆనుకుని ఉన్న ఈ పల్లె పట్టణ తరహాలో కనిపిస్తుంది. దాదాపు యాబై వేల జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ నివశిస్తున్న ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతోంది. కేవలం పంచాయతీ నుంచి పొందుతున్న సాధారణ నిధులు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘ నిధులు సిబ్బంది వేతనాలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ చేపట్టేందుకే కటకటలాడుతోంది. ఇప్పుడిది రూర్బన్‌ పంచాయతీల జాబితాలో చేరింది. పట్టణ తరహా సదుపాయాలు అందుబాటులోకి రానుండడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగిరిస్తున్నాయి. ఈ విధంగానైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందని అంతా భావిస్తున్నారు.

శృంగవరపుకోట, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు పంచాయతీలు రూర్బన్‌గా ఆవిర్భవించనున్నాయి. శృంగవరపుకోట, కొత్తవలస, జామి, చీపురుపల్లి, గరివిడి, రామభంద్రపురం పంచాయతీలు ఈ అర్హతను పొందాయి. పదివేలకు పైబడిన జనాభా, రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన పంచాయతీలు రూర్బన్‌గా మారనున్నాయి. వీటి పాలన బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కొణెదల పవణ్‌ కల్యాణ్‌ పంచాయతీ వ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. క్లస్టర్‌ విధానాన్ని రద్దు చేసి రూర్బన్‌, గ్రేడ్‌-1,2,3 పంచాయతీలుగా మార్పు చేస్తున్నారు. ఇంతవరకు పంచాయతీ వ్యవస్థలో ఐదు గ్రేడ్‌లుగా ఉన్న కార్యదర్శులను ఇక మీదట మూడు గ్రేడ్‌ల వరకు కుదించనున్నారు. పంచాయతీ కార్యదర్శి హోదాను పంచాయతీ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా మార్చాలనుకుంటున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 359 రూర్బన్‌ పంచాయతీలు, 3,082 గ్రేడ్‌-1, 3,163 గ్రేడ్‌-2, 6,743 గ్రేడ్‌-3 పంచాయతీలుగా విభజన జరుగనుంది. ఈ విధంగా జిల్లాలో 6 రూర్బన్‌, 71 గ్రేడ్‌-1, 261 గ్రేడ్‌-2, 620 గ్రేడ్‌-3 పంచాయతీలుగా మారనున్నాయి. ఈమేరకు కార్యదర్శుల నియామకం జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రతి మండలానికీ డిప్యూటీ ఎంపీడీవోల నియామకం చేపట్టింది. వీరంతా గ్రామ, వార్డు సచివాలయ పాలనను గాడిలో పెట్టనున్నారు. రూర్బన్‌ పంచాయతీలకు కూడా ఈ హోదా కలిగిన డిప్యూటీ ఎంపీడీవోలను నియమించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రేడ్‌-1 కార్యదర్శులు, సీనియర్‌ అసిస్టెంట్‌లకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించారు.

ఒకే నియోజకవర్గంలో మూడు

జిల్లాలో రూర్బన్‌ జాబితాలో ఉన్న ఆరు పంచాయతీల్లో శృంగవరపుకోట, కొత్తవలస, జామి పంచాయతీలు శృంగవరపుకోట శాసన సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నవి కావడం విశేషం. అయితే శృంగవరపుకోట, కొత్తవలస, చీపురపల్లి పంచాయతీలను ఎప్పటి నుంచో మునిసిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. చీపురుపల్లి పంచాయతీని ఓసారి మునిసిపాల్టీగా మార్చిన ప్రభుత్వం ఆ తరువాత వెనక్కి తీసుకుంది. మేజర్‌ పంచాయతీగానే ఉంది. ఈ మూడు పంచాయతీలు పట్టణ తరహాలో ఉంటాయి. మునిసిపాల్టీలుగా మారేందుకు వున్న అన్ని అర్హతలూ వీటికి ఉన్నాయి. శృంగవరపుకోట, కొత్తవలస పంచాయతీలు గ్రేటర్‌ విశాఖ నగరానికి సమీపంలో ఉన్నాయి. దీంతో పూర్తిగా నగర వాసనలు కనిపిస్తాయి. సదుపాయాల్లో మాత్రం మెరుగుదల లేదు. రూర్బన్‌గా మారనుండడంతో పట్టణ తరహా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతుండడంతో స్థానికుల్లో అనందం వ్యక్తమవుతోంది.

వినూత్నంగా రూపాంతరం

గ్రామీణ, పట్టణ ప్రాంత కలయిక (రూరల్‌-అర్బన్‌) రూర్బన్‌గా పిలవబడే ఈ పంచాయతీల్లో నగర పంచాయతీ తరహా పాలన ఉంటుంది. ప్రజారోగ్యం కాపాడేందుకు పూర్తిస్థాయిలో శానిటేషన్‌ చేపట్టనున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణతో పాటు మురుగు కాలువల నిర్వహణ, దోమల నియంత్రణకు ఫాగింగ్‌, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ వంటివాటిని నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగం ఉంటుంది. రహదారులకు మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇంజనీరింగ్‌ విభాగం అవతరించనునంది. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో చర్యలు చేపట్టేందుకు గ్రామీణ ప్రణాళిక విభాగం రూపొందనుంది. ఆస్తి, ఇతర పన్నుల వసూలు, జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ల జారీ కోసం రెవెన్యూ విభాగం ఏర్పాటు కానుంది. ఈ మార్పులతో పంచాయతీల్లో పట్టణ తరహాలో మెరుగైన సదుపాయాలు కల్పించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.

Updated Date - Dec 12 , 2025 | 12:39 AM