Share News

డీలిమిటేషన్‌ ఇప్పట్లో లేనట్టే

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:17 AM

డీలిమిటేషన్‌ జరుగుతుంది.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సంఖ్య పెరుగుతుంది..

 డీలిమిటేషన్‌ ఇప్పట్లో లేనట్టే

- కొత్త నియోజకవర్గాల కోసం కొన్నాళ్లు ఆగాల్సిందే

- జిల్లాలో యథావిధిగా కొనసాగనున్న రిజర్వేషన్లు

- రాజకీయ నాయకుల ఆశలపై నీళ్లు

పార్వతీపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌ జరుగుతుంది.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సంఖ్య పెరుగుతుంది.. కొన్ని నియోజకవర్గాల నుంచి వివిధ మండలాలను తప్పించి వాటితో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని ఆశించిన రాజకీయ పార్టీలు, ఆశావహులకు నిరాశే ఎదురైంది. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ఇప్పుడు కుదరదని, కొన్నాళ్లు ఆగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వారి ఆశలపై నీళ్లు పోసినట్లయింది. 2034 వరకు డీలిమిటేషన్‌ కొలిక్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగనున్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంటుంది.

జిల్లాలో పరిస్థితి...

జిల్లాలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్వతీపురం నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వేషన్‌, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకు ఎస్టీ రిజర్వేషన్‌ కొనసాగుతుంది. అయితే, డీలిమిటేషన్‌ లేకపోవడంతో నియోజకవర్గాల సంఖ్యతో పాటు రిజర్వేషన్లలో కూడా మార్పు ఉండదు. ఇప్పుడు కొనసాగుతున్న రిజర్వేషన్లు యథావిధంగా కొనసాగే పరిస్థితి ఉంది. డీలిమిటేషన్‌ జరిగితే జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు రిజర్వేషన్లు ప్రక్రియ కూడా మారుతుందని, ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులతో పాటు నాయకులు ఆశించారు. కానీ, డీలిమిటేషన్‌ లేకపోవడంతో 2034 వరకూ వారు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం..

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం డీలిమిటేషన్‌పై పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో డీలిమిటేషన్‌ తెలుగుదేశం పార్టీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, రాష్ట్రంలో జగన్‌ అధికారంలో ఉండడంతో ఫలితం లేకుండాపోయింది. వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే డీలిమిటేషన్‌ జరగలేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

2027 ప్రారంభం కానున్న జనగణన..

జనగణన కార్యక్రమం 2027లో ప్రారంభం కానుంది. వాస్తవంగా 2021లో జనగణన కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా సాధ్యపడలేదు. ప్రస్తుతం 2011లో జరిగిన జనగణన ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలు, రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. డీలిమిటేషన్‌ జరగాలంటే ముందుగా జనగణన కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమం 2027లో ప్రారంభం కానుంది. ఇది రెండేళ్ల పాటు అంటే 2029 వరకు కొనసాగే అవకాశం ఉంది. అప్పటికే ఎన్నికలు ప్ర క్రియ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. 2034 వరకు డీలిమిటేషన్‌ ఉండదని చెప్పవచ్చు.

Updated Date - Jul 28 , 2025 | 12:17 AM