Share News

ముందుచూపే కాపాడింది

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:26 AM

జిల్లా అధికార యంత్రాంగం ముందుచూపే మొంథా తుఫాన్‌ నష్ట తీవ్రతను తగ్గించింది.

ముందుచూపే కాపాడింది
కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, తుఫాన్‌ ప్రత్యేక అధికారి రవిసుభాష్‌(ఫైల్‌)

- యంత్రాంగం చర్యలతో తగ్గిన ‘మొంథా’ నష్ట తీవ్రత

- ప్రత్యేక చొరవచూపిన ప్రభుత్వం

- క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్‌ చేసిన వైనం

- తగ్గిన ప్రాణ, ఆస్తి నష్టం

విజయనగరం/కలెక్టరేట్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లా అధికార యంత్రాంగం ముందుచూపే మొంథా తుఫాన్‌ నష్ట తీవ్రతను తగ్గించింది. పక్కా ప్రణాళిక, కచ్చితమైన ఆచరణ, నిరంతర పరిశీలన, పర్యవేక్షణ, తీసుకున్న చర్యలు కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గింది. ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయడంలో యంత్రాంగం సఫలీకృతమైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌, జేసీ సేతుమాధవన్‌ నిత్యం క్షేత్రస్థారు సిబ్బందిని అలెర్ట్‌ చేయడంతో ఈ పెను తుఫాన్‌ నష్ట తీవ్రత తగ్గింది. మంత్రితో పాటు కలెక్టర్‌ మూడు రోజుల పాటు కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో తిష్ఠవేశారు. రాత్రి ఒంటిగంట వరకూ కంట్రోల్‌ రూమ్‌ నుంచి మానటరింగ్‌ చేస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముందుగానే జిల్లాకు 1,900 విద్యుత్‌ స్తంభాలు, 360 ట్రాన్స్‌ఫార్మర్లు, 500 మంది సిబ్బందిని రిజ్వర్‌ చేశారు. అయితే మొంథాతో విద్యుత్‌ శాఖకు పెద్దగా నష్టం జరగలేదు. విద్యుత్‌ సరఫరాలో కూడా అంతరాయం కలగలేదు. 67 స్తంభాలు నేలకూలగా, 23 ఫీడర్లు దెబ్బతిన్నాయి. వీటికి రూ.4.5కోట్లు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేశారు. గండిపడే అవకాశం ఉన్న 79 చెరువులపై ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గండిపడితే పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు ప్రజలు ఇళ్లకు పరిమతిం కావాలని, స్వీయ రక్షణ పాటించాలంటూ గ్రామాల్లో ప్రచారం చేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. పూరిళ్లు, శిథిల భవనాల్లో ఉన్నవారిని సచివాలయాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి, భోజనం సమకూర్చారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను గుర్తించి ముందుగానే ఆసుపత్రుల్లో చేర్పించారు. దీనివల్ల మేలు కలిగింది.

రహదారులు, ఇరిగేషన్‌ శాఖలకు..

మొంథా తుఫాన్‌తో ప్రధానంగా రహదారులు, ఇరిగేషన్‌ శాఖలకు నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 98 కిలోమీటర్ల మేర రోడ్లు, 29 సీసీ వర్క్‌లు, 8 సోర్స్‌ దెబ్బతినగా, 652 చెట్లు కూలిపోయాయి. దీంతో రూ.41.3 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి 36 రోడ్లు 75 కిలో మీటర్లు మరమ్మతులకు గురయ్యా యి. వీటివల్ల రూ.38.31 కోట్లు నష్టం వాటిల్లింది. మునిసిపాల్టీకి సంబంధించి మూడు రోడ్లు దెబ్బతిని రూ.8.5 లక్షలు, ఇరిగేషన్‌ పరిధిలో 184 సోర్సు దెబ్బతిని రూ.23.4 కోట్లు నష్టం కలిగింది. గ్రామీణ మంచినీటి విభాగం పరిధిలో దెబ్బతిన్న 34 వర్కులుకు సంబంధించి రూ.38 లక్షలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

2,729 హెక్టార్లలో పంటలకు నష్టం..

జిల్లాలోని 172 గ్రామాల్లో 2,297 మంది రైతులకు సంబంధించి పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 1,125 హెక్టార్లలో వరి నీటిలో మునిగిపోగా, మరో 1,603 హెక్టార్లలో పంట నేలవాలింది. నీటిలో మునిగిన వరి మాత్రం పొలంలో నీరు తగ్గే కొద్దీ నష్టతీవ్రత తగ్గుతుంది. పత్తి 14 హెక్టార్లు, మొక్కజొన్న 14 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. 30 మంది రైతులకు చెందిన కాలీఫ్లవర్‌, బొప్పాయి, అరటి వంటి పంటలు 12 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. జిల్లాలోని 21 మండలాల్లో 68 గ్రామాలు తుఫాన్‌ ప్రభావానికి గురయ్యాయి. 90 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పక్కా ఇళ్లు ఐదు, కచ్చా గృహాలు 6, పాక్షికంగా దెబ్బతిన్నవి 56, హట్స్‌ 26 ఇళ్లు ఉన్నాయి. వీటి విలువ రూ.21.36 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆరు పశువులు కూడా మృతి చెందాయి. వీటి విలువు రూ.3.18 లక్షలు ఉంటుంది. తుఫాన్‌ సమయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి 2,130 ఆహార ప్యాకెట్లు, 96,950 నీటి ప్యాకెట్లను అధికారులు పంపిణీ చేశారు.

Updated Date - Nov 01 , 2025 | 12:26 AM