పైసలిస్తేనే పని
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:23 AM
ప్రజాసేవే పరమావధిగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది లంచావతారులుగా మారుతున్నారు.
- లేదంటే ఆ ఫైల్ కదలదు
- లంచావతారులుగా కొంతమంది అధికారులు
- వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు
- ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతి అంతం
ఈ నెల 21న వేపాడ మండలం సింగరాయి వీఆర్వో సత్యవతి ఓ రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తమ పూర్వీకుల ఆస్తిని తన పేరిట దఖలు చేయాలంటూ ఆ రైతు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.లక్ష ఇవ్వనిదే పని చేయనని వీఆర్వో సత్యవతి తేల్చి చెప్పారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారు ఇచ్చిన సలహా మేరకు వీఆర్వోకు ఆయన రూ.లక్ష ఇస్తుండగా విజయనగరం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన వీఆర్వో బి.శ్రీనివాసరావు రూ.13వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రైతు నుంచి ముటేషన్ కోసం దరఖాస్తు రాగా, పని చేసేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు మాటువేసి వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఏడాది మే 13న జామి మండలం అలమండ గ్రామానికి చెందిన వీర్వో ఆర్నేపల్లి వేణు రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మ్యుటేషన్ లంచం డిమాండ్ చేయడంతో ఓ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వలపన్ని వీఆర్వో వేణును పట్టుకున్నారు.
ఈ ఏడాది జూలై 16న నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ తారక్‌నాథ్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి హౌస్ ప్లానింగ్ అనుమతుల కోసం కమిషనర్ దగ్గరకు వెళ్తే ఆయన రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన సలహా మేరకు ఆయన కమిషనర్‌కు రూ.15 వేలు అందిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మరో 15 నెలల్లో పదవీ విరమణ పొందుతారనగా కమిషనర్ అడ్డంగా బుక్కయ్యారు.
విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాసేవే పరమావధిగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది లంచావతారులుగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా, ఇంకా డబ్బుల సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకూ కాసులు ఇవ్వనిదే కనికరించడంలేదు. ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫైల్ ముందుకు కదలదనే అపవాదు ఉంది. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్, రిజిస్ర్టేషన్లు, పోలీస్ శాఖల్లో అవినీతి జాఢ్యం ఎక్కువగా ఉంది. జలగళ్ల మాదిరిగా ప్రజలను పట్టి పీలుస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నా వారి తీరులో మాత్రం మార్పురావడం లేదు. జిల్లాలో ఇలాంటి అనివీతి అధికారుల జాబితా ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో చాలా ప్రభుత్వ శాఖల్లో కొంతమంది అధికారులు, సిబ్బందికి చేయి తడపనిదే వారు పనులు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న పనులకు కూడా వారు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ, చివరకు లంచం డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్, భూసర్వే, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, వివిధ ధ్రువపత్రాల జారీ, ఇసుక రవాణా తదితర వ్యవహారాల్లో ఎక్కువగా అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖ సిబ్బందికి చేయి తడిపితేనే పనులు చేసే పరిస్థితి ఉంటుందని ప్రతి మండలంలోనూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల విషయంలో కూడా కొందరు అధికారులు, సిబ్బంది వాటాలు అడుగుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల గురించి చెప్పనవసరం లేదు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అప్రూవల్, అసెస్‌మెంట్ తదితర పనులకు సంబంధించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపల్ కమిషనర్లే నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనలు జిల్లాలో వెలుగుచూశాయి. ఉమ్మడి జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఏకంగా నలుగురు కమిషనర్లు లంచం తీసుకుంటూ గతంలో ఏసీబీకి పట్టుబడ్డారు.
లంచం అడిగితే ఇలా చేయండి..
లంచం ఇవ్వడం.. తీసుకోవడం రెండూ తప్పే. అవినీతి నిర్మూలనకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రభుత్వ అధికారి, సిబ్బంది లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారిపేర్లు ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం ప్రతిఒక్కరి వద్ద స్మార్డ్‌ఫోన్లు ఉన్నాయి. ఎక్కడైనా అవినీతి బాగోతాలు జరిగితే వీడియోలు, ఫొటోలు తీయాలి. వెంటేనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పనికిరాని పనులకు సోషల్ మీడియాను వినియోగించుకునేవారు, ఇటువంటి సామాజిక రుగ్మతల విషయంలో ఉపయోగించుకుంటే సమాజానికి సైతం మేలు చేసినవారవుతారు. ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలి. విజయనగరం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయం ఉంది. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400కు సైతం ఫిర్యాదు చేయవచ్చు.