It only works if you give money.మనీ ఇచ్చుకుంటేనే పని
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:00 AM
It only works if you give money. జిల్లాలోని ఓ తహసీల్దార్ 22(ఎ)లో ఉన్న చెరువును జిరాయితీగా మార్చి వేరొకరి పేరున రికార్డుల్లో నమోదు చేశారన్న ఆరోపణ ఉంది. జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే సబ్ డివిజన్ చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారని, అలాగే అడంగల్‌లోనూ మార్పులు చేసేశారని చెప్పుకుంటున్నారు
మనీ ఇచ్చుకుంటేనే పని
తీరు మారని రెవెన్యూ
గత ప్రభుత్వం నుంచీ అదే తీరు
డబ్బులివ్వలేక ఇబ్బంది పడుతున్న రైతులు
విసిగివేసారి ఏసీబీకి సమాచారం
శృంగవరపుకోట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
- జిల్లాలోని ఓ తహసీల్దార్ 22(ఎ)లో ఉన్న చెరువును జిరాయితీగా మార్చి వేరొకరి పేరున రికార్డుల్లో నమోదు చేశారన్న ఆరోపణ ఉంది. జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే సబ్ డివిజన్ చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారని, అలాగే అడంగల్‌లోనూ మార్పులు చేసేశారని చెప్పుకుంటున్నారు. భూములను ఆన్‌లైన్ చేసేందుకు డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఒప్పందం ప్రకారం డబ్బులు ముట్టజెప్పినప్పటికీ ఆ డబ్బులు సరిపోవడం లేదని అనడంతో ఆ వ్యక్తి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిగిన మరుసటి రోజే ఈ తహసీల్దార్ సస్పెండ్ అయ్యారు.
- మూడు నెలల కిందట జిల్లాలోని ఓ గ్రామ రెవెన్యూ అధికారి రైతు నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఆపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చుకు చిక్కాడు. రైతుకు చెందిన పొలాన్ని ఆన్‌లైన్ చేసేందుకు కార్యాలయం చుట్టూ తిప్పించుకున్న ఈ వీఆర్‌వో చివరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈమేరకు డబ్బులు ఇచ్చేందుకు రైతు అంగీకరించినప్పటికీ సెంటుకు రూ.1000 చొప్పున మూడు, నాలుగు ఎకరాలకు ఇవ్వాల్సిరావడంతో మనసు అంగీకరించక ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు డబ్బులు ఇస్తేకాని చాలా మండలాల్లో పని జరగడం లేదు. ఒప్పందం ప్రకారం డబ్బులు ముట్టజెప్పినా ఒక్కోసారి వారు కోరుకున్నంత సొమ్ము వస్తేనే తప్ప చేయి కదపడం లేదు. ఈ బరితెగుంపు వెనక ఉన్న ధైర్యమేంటో అర్థం కావడం లేదు. కాగా ఎటూ కాకుండా ఉన్న భూములను, రికార్డులు సక్రమంగా లేని భూములతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో హమ్మయ్యా ఇప్పటికైనా తమ భూములను ఆన్‌లైన్ చేసుకొనే భాగ్యం కలుగుతుందని రైతులు ఆశించారు. గత వైసీపీ ప్రభుత్వం చేయించిన రీసర్వేలో దొర్లిన తప్పులను కూడా సరిచేయించుకోవచ్చునని భావించారు. అయితే కూటమి ప్రభుత్వంలోనూ అధికారుల తీరు మారలేదు. రైతులు తమ పొలాలను వెబ్‌ల్యాండ్‌లో చేర్పించుకొనేందుకు మీసేవ, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులు చేయిచాపుతున్నారు. రియట్ ఎస్టేట్ వ్యాపారులు ఇస్తున్నట్లు ఇవ్వాలని రైతుల వద్ద పట్టుబడుతున్నారు. ఇవ్వకుంటే ఆ ఫైలును ముట్టుకోవడం లేదు. ఏదో ఒక సాకు చూపించి తిరస్కరిస్తున్నారు. గట్టిగా ఎవరైనా అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా వారడిగినంత డబ్బులు ఇవ్వకంటే అదే పరిస్థితి. దీంతో విసిగిపోయిన రైతుల్లో కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు నేరుగా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.
నాయకులూ పాత్రదారులే
రెవెన్యూ సమస్యలకు ప్రజా ప్రతినిధులు, పార్టీలో చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకులు కూడా కారకులే. ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉంటున్నాయి. ప్రజాప్రతినిధులకు దీటుగా నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉనికిని చాటుకొనేందుకు తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుంటున్నారు. ఈ ప్రకియలో భాగంగా ప్రజాప్రతినిధులతో పోటీపడుతున్నారు. డబ్బులు తీసుకొని పనిచేసే అధికారులకు నిబంధనలు పట్టడం లేదు.
కోకొల్లలుగా భూ సమస్యలు
వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో అత్యధికంగా భూ సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గత వైసీపీ ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టింది. ఈ రీసర్వే ద్వారా కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నెంబర్‌లను ఇచ్చింది. ఏ రైతుకు చెందిన భూమి ఆ రైతుకు కాకుండా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది రైతుల భూములకు ఒకే ఎల్‌పీఎం నెంబర్ ఇచ్చేసింది. క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఇలాంటి భూములకు అభ్యంతరం చెబుతోంది. భూములను విడదీసేందుకు తిరిగి రెవెన్యూ అధికారులను కలవాల్సి వస్తోంది. ఇదే అదనుగా రెవెన్యూ అధికారులు డబ్బులు ఇస్తేనే కాగితాన్ని కదుపుతున్నారు. లేదంటే తిప్పుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పిన పనులను క్షణాల్లో చేసేస్తున్నారు. ఈ క్రమంలో నేతలే తప్పులు చేసిన అధికారులను కాపాడుతుండడంతో వీరికి భయం లేకుండాపోయింది.