మూసేసి ఐదేళ్లయింది!
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:33 AM
భీమసింగి చక్కె ర కర్మాగారం పరిధిలోని రైతుల్లో అత్యధిక శాతం మంది చెరకు సాగును వదిలేశారు. కొంతమంది రైతులు సాగు తగ్గించారు. దీంతో లక్ష టన్నుల ఉత్పత్తి నుంచి ఐదు వేల టన్నుల ఉత్పత్తికి పడిపోయింది.
ప్రాభవం కోల్పోయిన భీమసింగి చక్కెర కార్మాగారం
వైసీపీ హయాంలో ఆధునికీకరణ పేరిట మూసివేత
తర్వాత పట్టించుకోని అప్పటి సీఎం వైఎస్ జగన్
రెండు జిల్లాలోని 18 మండలాల రైతులకు తీవ్ర నష్టం
లక్ష నుంచి 5 వేల మెట్రిక్ టన్నులకు పడిపోయిన ఉత్పత్తి
జీతాలు, పీఎఫ్‌లు చెల్లించక కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు
మార్చిలో శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే లలిత కుమారి
ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న కర్మాగారం అది. ఒకే ఏడాదిలో 1.90లక్షల టన్నుల చెరకు గానుగ ఆడించిన ఘనత ఉంది. విజయనగరం నుంచే కాదు.. పొరుగున ఉన్న విశాఖ జిల్లా నుంచి కూడా చెరకు ఇక్కడికి తరలించేవారు. సీజన్ వచ్చిందంటే.. రోడ్డు పొడవునా చెరకు బండ్లు సందడి చేసేవి. ఈ కర్మాగారం చైర్మన్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా జరిగేవి. ప్రజాప్రతినిధులు తమ పార్టీకి చెందిన వ్యక్తిని ఈ సీట్లో కూర్చోబెట్టేందుకు రైతుల వద్దకు పరుగు పెట్టేవారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కర్మాగారం కాలక్రమేణా కనుమరుగై పోయింది. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో మూతపడింది. ఆధునికీకరిస్తామని చెప్పిన వైసీపీ అధినేత జగన్ మాట తప్పారు. దీంతో రైతులు చెరకు సాగు పూర్తిగా తగ్గించారు. ఇప్పుడు ఈ పరిశ్రమ తెరిపించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
శృంగవరపుకోట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):
- భీమసింగి చక్కెర కార్మాగారం గానుగ ఆడేటప్పుడు నా సగం పొలంలో చెరకు, మరో సగంలో వరి పండించేవాడ్ని. ఒక పంట గిట్టుబాటు కాకున్నా మరోదానిలో మంచి ఆదాయం వచ్చేది. ఒక్కోసారి రెండు పంటల్లోనూ మిగులుబాటు అయ్యేది. దీనివల్ల కుటుంబాన్ని బాగా పోషించుకునే వాడ్ని. ఇప్పుడు ఈ చక్కెర కర్మాగారం మూతబడింది. పండిన చెరకు పంటను సంకిలి చక్కెర కర్మాగారానికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అదేమో చాలా దూరం ఉంది. అక్కడికి తరలించడం ఎంతో కష్టం. దీంతో చెరకు వేయడం మానుకున్నా. పూర్తిగా వరి పంటే సాగు చేస్తున్నా. దీంతో దిగుబడి రాక.. వచ్చినా గిట్టుబాటులేక నష్టపోతున్నా. భీమసింగి కర్మాగారం తెరిపిస్తే తిరిగి చెరకు సాగు చేస్తా. కానీ తెరిచే మార్గం కనిపించడం లేదు.
- ఓ రైతు అవేదన ఇది.
భీమసింగి చక్కె ర కర్మాగారం పరిధిలోని రైతుల్లో అత్యధిక శాతం మంది చెరకు సాగును వదిలేశారు. కొంతమంది రైతులు సాగు తగ్గించారు. దీంతో లక్ష టన్నుల ఉత్పత్తి నుంచి ఐదు వేల టన్నుల ఉత్పత్తికి పడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఆధునికీకరణ పేరిట ఈ పరిశ్రమను మూసేసిన సంగతి తెలి సిందే. అప్పటి నుంచి ఈ కర్యాగారం పరిధిలో పండిస్తున్న చెరకు ను సంకలి కర్మాగారానికి తరలిస్తున్నారు. ఇది చాలా దూరంలో ఉండడంతో రైతులకు వ్యయప్రయాసలుగా మారింది. భీమసింగి కర్మాగారం మూతబడే సమయానికి 51,759 టన్నులు సంకిలికి తరలించాల్సి రావడం తో.. ఆమరుసటి ఏడా దే సాగు సగానికి సగం తగ్గిపోయిం ది. అప్పటి నుం చి తగ్గుతూ వచ్చింది. గత ఏడాది కేవలం 9వేల టన్నుల సరఫరా జరిగింది. ఈ సీజన్‌లో 5 వేల టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో మద్దతు ధర ప్రకటించకుండానే చెరకు తరలింపునకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో ఆందోళన కనిపి స్తోంది. దీనికితోడు గత ఏడాది సంకిలి కర్మాగారం యాజమాన్యం రవాణా చార్జీలు మిన హా టన్నుకు రూ.2,800 ధర చెల్లిస్తామని చెప్పింది. కానీ రూ.2,725 చేతిలో పెట్టింది. టన్నుకు రూ.75 కోత పెట్టడంతో రైతులు మరింత నష్టపోయారు. ఈ బకాయిలను ఇవ్వాలని రైతులు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేదు. ఈ ఏడాది ఎంత ధర ఇస్తారో కూడా తెలియదు. భీమసింగి కర్మాగార పరిధి రైతులు శుక్రవారం నుంచి చెరకును తరలించేందుకు అధికారులు పూనుకున్నారు.
చెరకు సాగు తగ్గించిన రైతులు
భీమసింగి కర్మాగారం పరిధిలో రైతులు గతంలో తమకు ఉన్న భూమిలో కొంత చెరకు, మరికొంత వరి పండించేవారు. ఒక పంటలో నష్టం వచ్చిన మరో పంటలో దీన్ని భర్తీ చేసుకునేవారు. ఒక్కో ఏడాది రెండు పంటల్లోను లాభాలు వచ్చేవి. కర్మాగారం మూసివేయడంతో చాలామంది రైతులు చెరకు సాగును తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేశారు. ఇప్పుడు పూర్తిగా వరి పంటవైపు మళ్లారు. ఈ పంట పెట్టుబడులకే సరిపోతుంది. పోనీ సంకిలి కర్మాగారానికి తరలించినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపిస్తే బాగుటుందన్న ఆశ ఇటు రైతుల్లోను, ఆటు కార్మికుల్లోను ఉంది. ఈ కార్యాగారం మూసేసిన సమయంలో కార్మికుల జీతాలు, పీఎఫ్‌లను చెల్లించలేదు. వాటి కోసం ఇప్పటికి కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ఈ ఏడాది శాసనసభ సమావేశాల్లో శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ప్రస్తావించారు. ఈ కర్మాగారం గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్న కె.శ్రీనివాస్ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ మంత్రిగా వ్యవహిరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇదే శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపల్లి ఈ కర్మాగారంను ఎంఎస్‌ఎంఈ జాబితాలోకి తీసుకుని వచ్చి న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
ఎంతో ఘన చరిత్ర
1973లో నుంచి ఉన్న ఈ కర్మాగారం 1.90లక్షల టన్నుల చెరకు గానుగ చేసిన చరిత్ర ఉంది. కర్మాగారానికి విజయనగరం జిల్లాలోని భోగాపురం, బొండపల్లి, డెంకాడ, గజపతినగరం, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, నెల్లిమర్ల, పూసపాటి రేగ, ఎస్.కోట, వేపాడ, విజయనగరం మండలాలతో పాటు విశాఖపట్నం జిల్లా అనందపురం, పద్మనాభం, భీమినిపట్నం, కె.కోటపాడు మండలాలతో కలుపుకుని 18 మండలాలకు చెందిన రైతులు చెరకును సరఫరా చేసేవారు. ప్రతి ఏటా డిసెంబరు నెల నుంచి జనవరి నెలాఖరు వరకు జామి మండలం అలమండ, ఎస్.కోట, ఈ మండల పరిధిలోని పోతనాపల్లి, ఎల్.కోట, గంట్యాడ మండలం కోర్లాం, గజపతినగరం, పూసపాటి రేగ మండలం నాతవలస, పద్మనాభం మండలం శిర్లపాలెం కాటాల వద్ద చెరకుతో ఎండ్ల బండ్లు సందడి చేసేవి. ఈ కర్మాగార చైర్మన్ ఎన్నికలు జిల్లా ప్రాథమిక సహకార సంఘం (డీసీసీబీ) ఎన్నికకంటే ప్రతిష్టాత్మకంగా జరిగేవి. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు తమ పార్టీకి చెందిన వ్యక్తిని ఈ సీట్లో కూర్చోబెట్టేందుకు రైతుల ఇళ్లకు పరుగు పెట్టేవారు. ఇంతటి ఘన చరిత్ర వున్న ఈ కర్మాగారం కాలక్రమంలో మసకబారింది. బెల్లం తయారీలో ఎక్కువ లాభాలు రావడంతో రైతులు కర్మాగారానికి చెరకు సరఫరా తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెరకు గిరాకీ తగ్గడం కూడా ఈ కర్మాగారంపై ప్రభావం చూపింది. సహకార వవ్యవస్థలో నడిచే ఏకైక కర్మాగారాన్ని కాపాడేందుకు నేతలు చొరవ చూపలేదు. లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న దీన్ని 2020-2021 సీజన్‌లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆధునికీకరిస్తామని చెప్పిన వైసీపీ సర్కారు ఐదేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదు. మూసేసిన ఒకట్రెండు సంవత్సరాల తరువాత కార్మికులు, రైతులు కర్మాగారాన్ని తెరిపించేందుకు రూ.5కోట్లు కేటాయించాలని విన్నవించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఈ ప్రాంతానికి ప్రభుత్వ పెద్దలు ఎవరు వచ్చినా గుర్తు చేసేవారు. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది. కనీసం రూ.15 కోట్లు అందిస్తే తప్ప అధునికీకరణ జరిగే అవకాశం లేదు.
సంకిలి సుగర్స్‌పై నీలినీడలు
భవిష్యత్తుపై అయోమయం
ఏటా తగ్గుతున్న చెరకు విస్తీర్ణం
ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు
రేగిడి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగా రం కొనసాగింపుపై రైతుల్లో సందిగ్ధత నెలకొం ది. దీంతో ఉద్యోగులు, కార్మికులు అభద్రతా భావం తో ఉన్నారు. మరోవైపు రైతుల రాయితీలకు మంగళం పాడడం చర్చకు దారితీస్తోంది. 1997లో రాజాంకు చెందిన జీఎంఆర్ ఈ ప్రాంత చెరకు రైతుల శ్రేయస్సు దృష్ట్యా చక్కెర పరిశ్రమ ను స్థాపించారు. కాలక్రమం లో ఈ సంస్థను చైన్నైకి చెందిన మురుగప్పా గ్రూపు 12ఏళ్ల క్రితం కొ నుగోలు చేసి ఈఐడీ ప్యారీ సుగర్ ఇండస్ట్రీ పేరుతో నడుపుతోంది. ఈ సంస్థలో డిస్టిల రీ ప్లాంట్‌లతో కలిపి ఎగ్జిక్యూటివ్‌లు, కార్మికులు 250 మంది వరకు ఉన్నారు. ఇంకా సీజనల్, క్యాజు వల్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వంద మంది వరకు ఉంటారు. పరోక్షంగా వందలాది మంది ఈ ఫ్యాక్టరీపై ఆధారపడుతున్నారు. గత రెండు మూడేళ్లుగా చెరకు విస్తీర్ణం, క్రషింగ్ గణనీ యంగా తగ్గడంతో నిర్వహణ భారంగా మారి నట్టు యాజమాన్య ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో చెన్నైలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆరు నెలల క్రితం తనిఖీల పేరుతో ఓ బృందం ఇక్కడికి వచ్చింది. మిగులు సిబ్బంది పేరుతో కొంత మందికి ఉద్వాసన పలికినట్లు చెబుతున్నారు. ఇలా తొలగింపునకు గురైన వారిలో దాదాపు 40 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 60మంది వరకు కాంట్రాక్టు, ఇతర కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది చెరకు లేకపోతే ఫ్యాక్టరీ మూత పడుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానిక యాజమాన్య ప్రతినిఽఽధులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ విషయమై సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకటసూర్యతేజ స్పందిస్తూ.. మూత పడే విషయమై తమకు సమాచారం లేదని తెలిపారు. ఉద్యోగులను తొలగించడమనేది యాజమాన్యం నిర్ణయమని తెలిపారు.
తిరోగమనంలో చక్కెర పరిశ్రమ
జీఎంఆర్ హయాంలో ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి 8 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేసేవారు. ఈఐడీ ప్యారీ చేతికి వెళ్లినప్పటి నుంచి తిరోగమనం మొదలైందని కార్మికులు, రైతులు అంటున్నారు. గత ఏడాది 3.59లక్షల మెట్రిక్ టన్నులు కాగా... ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అది కూడా జిల్లాలోని రెండు కర్మాగారాల మూతతో ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చుని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ కర్మాగారం పరిధిలో 15 మండలాల కు చెందిన 20వేలకు పైబడి చెరకు రైతులు ఉండేవారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కేవలం 7వేల లోపు రైతులు ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ఏడాదిలో 12వేల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్న ప్లాంట్.... ప్రస్తుతం 3వేల హెక్టార్లకు పడిపోయింది. పంచదార మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం... మద్దతు ధర సరిపోకపోవడం.. సాగు ఖర్చులు పెరగటం... దిగుబడి ఎకరాకు కనీసం 20 టన్నులు రాకపోవటం రైతుకు గుదిబండగా మారింది. ఈ ఏడాది టన్ను చెరకు ధర రూ.3,360 కాగా, గత ఏడాది కంటే రూ.209 పెంచారు. ఇది గిట్టుబాటు కాదని రైతుల వాదన. దీంతో వారు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. ఇవన్నీ కలిపి సంస్థ మనుగడపై ప్రభావం చూపే అవకా శాలు కనిపి స్తున్నాయి.