IT companies to Vijayanagar విజయనగరానికి ఐటీ కంపెనీలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:47 PM
IT companies to Vijayanagar జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, విజయనగరానికి ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
విజయనగరానికి ఐటీ కంపెనీలు
పారిశామ్రిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ నేతల విమర్శలు సరికాదు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి):
జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, విజయనగరానికి ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు రావడంతో పాటు స్థానికులకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌తో ప్రపంచమంతా రాష్ట్రాన్ని కొనియాడుతుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏమి చేశారో? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,400 కోట్లు తెచ్చి పరిశ్రమను గాడిలో పెట్టామన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, ఏపీలో అనుకూలమైన గనులు లేనందున కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎండీసీ ముడి సరుకును కొనుగోలు చేస్తోందన్నారు. యువనేత నారా లోకేశ్ యువగళం యాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో కొంత మంది వైసీపీ నాయకులు ఽధాన్యం కొనుగోళ్లు వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారని, వారు విమర్శలు చేసేముందు వారి హయాంలో ఏమి జరిగిందో? ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు.
వైసీపీ పాలనలో ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతుల నుంచి బస్తాకు ఐదు కిలోలు అదనంగా తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా గన్నీలు నేరుగా రైతులకు తీసుకోమని చెప్పి డబ్బులు జమ చేశామన్నారు.