Is this your observation? ఇదేనా.. మీ పరిశీలన?
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:56 PM
Is this your observation? పింఛన్ పునః పరిశీలన ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. పింఛన్‌కు అన్ని అర్హతలూ ఉన్న వారిని కూడా అనర్హులుగా తేల్చడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఇదేనా.. మీ పరిశీలన?
56శాతం దివ్యాంగునికి ఇప్పుడు 5శాతమేనంట
అర్హుల పింఛన్లు తొలగించిన అధికారులు
దశాబ్దం నుంచి పొందుతున్న వారికీ అన్యాయం
అప్పీల్ కోసం కార్యాలయాలకు బాధితుల పరుగు
- ఆయన పేరు పిల్లా స్వామినాయుడు. శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామం. రెండు కాళ్లు వంకరపోయాయి. నడిచేందుకు నానా అవస్థలు పడుతున్నాడు. 2011లో ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఈయనలో 56శాతం దివ్యాంగ లోపం వున్నట్లు ధ్రువపత్రం అందించింది. అప్పటి నుంచి దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగ ధ్రువపత్రాల పునఃపరిశీలనకు నియమించిన వైద్యులు ఐదు శాతం మాత్రమే లోపం ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం 40శాతం దివ్యాంగత్వం లేకపోవడంతో పింఛన్ తొలగించారు.
- ఆయన పేరు మంత ఎర్నియుడు. శృంగవరపుకోట మండలం తలారి గ్రామ శివారు ఉసరి. రెండు కాళ్లలో ఒక కాలు చిన్నగా ఉంటుంది. 2008లో ప్రభుత్వ వైద్యుల బృందం 40శాతం దివ్యాంగత్వం ఉన్నట్లు ధ్రువపత్రం అందించింది. అప్పటికి ఇతని వయసు నాలుగేళ్లు. దాదాపు 15 సంవత్సరాల నుంచి పొందుతున్న దివ్యాంగ పింఛన్‌ను ఇటీవల పునఃపరిశీలనలో ప్రభుత్వం తొలగించింది.
శృంగవరపుకోట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
పింఛన్ పునః పరిశీలన ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. పింఛన్‌కు అన్ని అర్హతలూ ఉన్న వారిని కూడా అనర్హులుగా తేల్చడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో 90, 87, 79 60 దివ్యాంగ శాతంతో సామాజిక పింఛన్‌లను అందుకుంటున్న వారిని అనర్హులుగా గుర్తించారు. శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారికి జరిగిన పునఃపరిశీలలో అత్యధిక శాతం మందికి అతి తక్కువ దివ్యాంగ శాతం గుర్తింపు నిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునఃపరిశీలనకు వెళ్లినప్పుడు కనీసం ముఖం కూడా చూడలేదని, ఎటువంటి పరీక్షలు చేయకుండానే పంపించేయడంతో అప్పుడే అనుమానించామని బాధితులు అంటున్నారు. సరిగా తనిఖీ చేయకుండా నచ్చిన విధంగా దివ్యాంగ శాతం నమోదు చేయడంతో తమకు అన్యాయం జరిగిందని మంగళవారం ఎస్.కోట ఎంపీడీవో కార్యాలయానికి అప్పీల్‌కు వచ్చిన పలువురు దివ్యాంగులు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వాపోయారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్, దివ్యాంగ పింఛన్‌దారుల్లో అనర్హులను భారీగా గుర్తించింది. దీంతో అర్హులను పక్కాగా తేల్చేందుకు పునః పరిశీలనకు ఆదేశించింది. జిల్లా కేంద్ర ఆసుపత్రి(జీజీహెచ్), ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రత్యేక సదరం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా మెడికల్, దివ్యాంగుల శాతం నిర్ధారించేందుకు షెడ్యూల్ వారీగా పింఛన్‌దారులను తరలించారు. దాదాపు మూడు నెలల పాటు వీరికి పునఃపరిశీలన చేపట్టారు. అనంతరం మెడికల్, దివ్యాంగ శాతం వివరాలను పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు నేరుగా పంపించారు. ఆ ప్రకారం మెడికల్, దివ్యాంగ శాతం తక్కువగా ఉన్నవారందరి సామాజిక పింఛన్‌ను తొలగించారు. ఇందుకు సంబంధించిన జాబితాను నాలుగు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించారు. అయితే శుక్రవారం నుంచి అదివారం వరకు సెలవులు రావడంతో బాధితులకు సమాచారం ఇవ్వలేదు. అప్పటికే గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దల ద్వారా తెలుసుకున్న వీరంతా ఎప్పటి నుంచో అందుకుంటున్న పింఛన్‌ను ఇప్పుడు తొలగించడమేంటని మథనపడుతూ వచ్చారు. కాగా సోమవారం నుంచి తొలగించిన మెడికల్, దివ్యాంగ పింఛన్‌దారులకు సచివాలయ సంక్షేమ అసిస్టెంట్‌లు నోటీస్‌లు అందించారు. పునఃపరిశీలనలో వైకల్య శాతం 40శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఎంత శాతం వుందో అందులో పొందుపరచలేదు. దీంతో పింఛన్ తొలగింపు నోటీస్‌లు అందుకున్న వారంతా పునఃపరిశీలనలో ఎంత శాతం నమోదు చేసారో చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయ అధికారులను డిమాండ్ చేశారు. ఆ వివరాలేమి లేవని, ప్రస్తుతానికైతే నోటీస్‌లు అందుకున్నవారంతా అర్హులని భావిస్తే మండల ప్రజా పరిషత్ అధికారి, మున్సిపల్ అధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచించారు. దీంతో వీరంతా మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
అప్పీల్‌కు అవకాశం
దివ్యాంగ పింఛన్‌లకు అనర్హులుగా నోటీస్‌లు అందుకున్నవారంతా తాము అర్హులమని భావించినట్లయితే మండల ప్రజాపరిషత్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో అప్పీలు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక్కడ ఇచ్చిన వినతిపత్రాన్ని పింఛన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీరందరికీ దివ్యాంగ శాతం గుర్తింపునకు మరోసారి నోటీస్‌లు జారీ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం జీజీహెచ్, ప్రాంతీయ ఆసుపత్రుల్లో దివ్యాంగ శాతం గుర్తింపునకు గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు పంపిస్తారు. ఈమేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్య విద్య డైరెక్టర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్‌ల నుంచి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌లకు సమాచారం అందింది.