Is this so careless? ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:42 PM
Is this so careless? మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించారు.
ఇంత నిర్లక్ష్యమా?
రక్తం ఎక్కించడంలో గందరగోళం
ఒకరి రక్తం మరొకరికి ఎక్కించిన వైనం
ఆలస్యంగా వెలుగులోకి
విజయనగరం రింగురోడ్డు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించారు. ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన పి.సూరమ్మ (బి పాజిటివ్ గ్రూప్), విజయనగరం మండలం రాకోడుకు చెందిన ఎ.సూరమ్మ (ఓ పాజిటివ్ గ్రూప్) ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరూ ఈ నెల 24న శస్త్ర చికత్సల కోసం ఎముకుల విభాగంలో చేరారు. 25న సాయంత్రం శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా ఇద్దరికీ రక్తం తక్కువగా ఉండడంతో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మేరకు వైద్యులు సూచించారు. అయితే బి పొజిటివ్ గ్రూప్‌నకు చెందిన పి.సూరమ్మకు ఓ పాజిటివ్, ఓ పాజిటివ్ గ్రూప్‌నకు చెందిన ఎ.సూరమ్మకు బి పాజిటివ్ రక్తాన్ని నర్సులు ఎక్కించారు. ఇద్దరిదీ ఒకే పేరు కావడంతో గందరగోళం చెందారు. అయితే రక్తం ఎక్కిస్తుండగా తప్పును గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఆపేశారు. పొరపాటు బయట పడకుండా వైద్యులు, సిబ్బంది జాగ్రత్త వహించారు. అనంతరం ఇద్దరికీ వైద్య పరీక్షలు చేసి ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. పేర్లు ఒకేలా వున్నా, అత్యంత సున్నితమైన రక్త మార్పిడి ప్రక్రియలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజని వివరణ కోరగా జరిగిన విషయం వాస్తవమేనని, పేర్లు ఒకేలా ఉండడంతో వైద్య సిబ్బంది గందరగోళానికి గురై రక్తాన్ని ఎక్కించినట్టు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇద్దరు రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు.