Share News

work is supposed to be done? పనులు చేపట్టేది ఇలాగేనా?

ABN , Publish Date - May 17 , 2025 | 11:22 PM

Is this how the work is supposed to be done? కురుపాంలో రోడ్డు, కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం.. అడిగే వారే లేకపోవడంతో నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదు.

  work is supposed to be done?  పనులు చేపట్టేది  ఇలాగేనా?
కురుపాం బస్టాండు సమీపంలో రోడ్డుకు మీటర్‌ పైగా ఎత్తులో నిర్మించిన కాలువ

రోడ్డు విస్తరణా అంతే..

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ప్రజల పెదవి విరుపు

ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

కురుపాం, మే17(ఆంధ్రజ్యోతి): కురుపాంలో రోడ్డు, కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం.. అడిగే వారే లేకపోవడంతో నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదు. రోడ్డుకు మీటర్‌ ఎత్తులో కాలువలు నిర్మిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇంజనీరింగ్‌ సిబ్బంది లేకుండానే ప్రధాన రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- వాస్తవంగా 2022లో తోటపల్లి-కురుపాం 14 కిలో మీటర్లు రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. అప్పట్లో రూ.33 కోట్లను మంజూరు చేశారు. తోటపల్లి నుంచి కురుపాం వరకు బీటీ రోడ్డు వేశారు. కురుపాంలో సీమనాయుడు వలస సెంటర్‌, మేరంగి జంక్షన్‌ వద్ద సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా 2023లో కురుపాం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 14 మీటర్ల మేర షాపులు, ఇళ్లు, పలు ఆక్రమణలను తొలగించి కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే బీటీ రోడ్డు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి పూడికపోయాయి. మురుగునీరు వెళ్లక స్థానికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పైప్‌లైన్లు కూడా ధ్వంసం కావడంతో తాగునీటికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.

- ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించి.. పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గత మూడు నెలలుగా రోడ్డు విస్తరణ, కాలువ పనులు ఊపందుకున్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన పనులు చేపడుతున్నారు.

పనులు ఇలా..

- స్థానిక దూళికేశ్వరస్వామి ఆలయం వద్ద కొత్తగా కల్వర్టు నిర్మించారు. అక్కడున్న ప్రధాన కాలువకు అనుసంధానంగా దీనిని నిర్మించకపోవడంతో ఆ ప్రాంతంలో మురుగునీరు నిలిచి పోతుంది. ప్రధాన రహదారి కంటే ఆరు అంగుళాల ఎత్తులో కల్వర్టు, కాలువలు నిర్మించడంతో ఈ సమస్య నెలకొంది. వర్షాలు కురిసే సమయంలో మెయిన్‌ రోడ్డులో ఉన్న ధూళికేశ్వరస్వామి ఆలయంలోకి మురుగునీరు చేరే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.

- వడ్డీ వీధి, బ్రాహ్మణుల వీధిలో కాలువల కంటే మెయిన్‌ రోడ్డులో కాలువలను ఎత్తుగా నిర్మించడంతో సక్రమంగా మురుగునీరు వెళ్లడం లేదు.

- త్రినాథస్వామి ఆలయం వైపు కాలువ నిర్మించకోపోవడంతో ఇళ్లలో వాడుక నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోతుంది.

- బస్టాండ్‌ వద్ద ఉన్న ఇళ్లు, రోడ్డుకు మీటరు ఎత్తులో కాలువలు నిర్మించారు. దీంతో వాడుక నీరు ఎలా వెళ్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- విస్తరణలో భాగంగా కురుపాంలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులపై కూడా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు..

మూడు మండలాలకు ఏఈలు లేకోపోవడంతో ఇన్‌చార్జి బాధ్యతలు చేపడుతున్నా. పనుల ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నాం. కనీసం ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లేరు. కురుపాంలో చేపడుతున్న రోడ్డు, కాలువ పనుల్లో లోపాలు మా దృష్టికి రాలేదు. పైనలవీధి సమీపంలో స్థానికులు అభ్యంతరం తెలపడంతో అక్కడ కాలువ నిర్మాణం చేపట్టలేదు.

- సుశీల, ఇన్‌చార్జి ఆర్‌అండ్‌బీ ఏఈ

Updated Date - May 17 , 2025 | 11:31 PM