Ineligible Are Identified? అనర్హుల గుర్తింపు ఇలాగేనా?
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:35 AM
Is This How the Ineligible Are Identified? ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కొంత మంది వైద్యుల తీరు, క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులకు అన్యాయం జరిగింది.
నడవలేని స్థితిలో ఉన్నా పింఛను అక్కర్లేదని సిఫారసు
క్షేత్రస్థాయిలో పొరపాట్లుతో అర్హులకు అన్యాయం
న్యాయం చేయాలని కలెక్టరేట్‌లో దివ్యాంగుల వినతి
పార్వతీపురం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కొంత మంది వైద్యుల తీరు, క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులకు అన్యాయం జరిగింది. కళ్లు కనబడకపోతే కాళ్లు బాగున్నాయని, వీలు కుర్చీలో ఉన్నా.. పింఛన్ అవసరం లేదని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. అన్యాయంగా తమ పింఛన్లు రద్దు చేశారని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రాలు అందించారు.
అంధులైనా..
- పాలకొండ మండలం బుక్కూరు గ్రామానికి చెందిన సింగర్తి నీరజ అంధురాలు. 2015లో ఇచ్చిన సదరం ధ్రువీకరణ పత్రం ఆధారంగా దివ్యాంగుల పింఛను అందిస్తున్నారు. కాని ఇటీవల సదరం పరిశీలనలో ఆమెకు కాళ్లు బాగానే ఉన్నాయని, పింఛను ఇవ్వక్కర్లేదని వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీంతో ఆమెకు పింఛను రద్దు చేశారు. దీంతో నీరజ తన నాన్నమ్మ చిన్నమ్మడు తోడుతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చింది. పింఛన్ పునరుద్ధరించాలని కోరింది.
- అదే మండలం బుక్కూరు గ్రామానికి చెందిన రాగోలు సుదర్శనకు కంటి చూపు పోవడంతో గతంలో దివ్యాంగుల పింఛను మంజూరు చేశారు. కాని ఇటీవల జరిగిన సదరం పరిశీలనలో ఆయనకు కాళ్లు బాగానే ఉన్నాయని ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఆయన పింఛను రద్దయ్యింది. దీంతో తన భార్య సహకారంతో కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం ఇచ్చాడు.
నడవలేకున్నా.
- వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన జి.కోటేశ్వరరావునాయుడు గత ఏడేళ్లుగా నడవలేని స్థితిలో ఉన్నారు. వీల్‌చైర్‌కే పరిమితమైన ఆయనకు దివ్యాంగుల పింఛన్‌ను అంది స్తున్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలు పరిశీలన అనంతరం వృద్ధాప్య పింఛన్‌గా మార్చేశారు. ఈ విధంగా ఎంతోమంది కలెక్టరేట్‌లో అర్జీలు అందించారు. దివ్యాంగుల పరిస్థితి చూసి కూడా ఇష్టానుసారంగా సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని వారు వాపోయారు. ఇదిలా ఉండగా పింఛన్లు రద్దయిన వారు అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పత్రాలన్నీ సమర్పించినా.. పింఛను పునరుద్ధరణ అవుతుందో లేదోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ సుధారాణిని వివరణ కోరగా.. ‘అర్హులైన దివ్యాంగుల పింఛన్ రద్దయితే తగిన ఆధారాలతో పత్రాలు సమర్పించాలి. దీని కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే అర్జీలు స్వీకరిస్తున్నాం.’ అని తెలిపారు.