ఇది తగునా?
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:14 PM
సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులతో సిబ్బంది వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
-గిరిజన విద్యార్థులతో పనులు
-వంటలు, వడ్డింపులు వారితోనే
- అటకెక్కుతున్న చదువులు
- పట్టించుకోని అధికారులు
సీతంపేట రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులతో సిబ్బంది వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంట పనులతో పాటు తోటి విద్యార్థులకు వడ్డిండచం, ఇతర పనులను వారితోనే చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల యోగక్షేమాలు, మెనూ అమలు, ఆరోగ్య పరిరక్షణ, విద్యా ప్రమాణాల స్థాయి వంటి వాటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలకు సీతంపేట ఏపీఆర్ గురుకుల పాఠశాల మైదానంలోకి మురుగునీరు చేరింది. దీంతో పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోగా విద్యార్థినులకు పలుగు, పార ఇచ్చి మురుగునీటికి అడ్డుకట్ట వేసే పనులు చేయించారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఇటీవల 85మంది నాల్గో తరగతి ఉద్యోగులను పొరుగుసేవల ప్రాతిపదికన నియమించారు. అన్ని పాఠశాలలకు వీరిని అవసరం మేరకు కేటాయించారు. అయినప్పటికీ ఆయా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులతో వంట, వడ్డింపు వంటి పనులను చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెనూకు తూట్లు..
ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలుకావడం లేదు. వారంలో రెండు రోజులు ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చికెన్ కూర అందించాల్సి ఉంది. కానీ, చాలా పాఠశాలల్లో 30 గ్రాములు(రెండు ముక్కలు) వడ్డించి చేతులు దులుపుకొంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ఉడకపెట్టిన కోడిగుడ్లు ఇవ్వడం లేదు. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ మెనూలో కోత విధిస్తుండడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
కానరాని పర్యవేక్షణ..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు, 12 గురుకులాలు, 18 పోస్టుమెట్రిక్ వసతి గృహాల్లో 16 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సీతంపేట ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ బాధ్యతలను కూడా డీడీ అన్నదొర పర్యవేక్షిస్తున్నారు. మెళియాపుట్టి రెగ్యులర్ ఏటీడబ్ల్యూవో ఇటీవల బదిలీపై వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలను లాబర పాఠశాల హెచ్‌ఎం సూర్యనారాయణకు అప్పగించారు. రెండు ఏటీడబ్ల్యూవో పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో గిరిజన పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది.
గిరిజన సంక్షేమశాఖ అధికారులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమ, గురుకుల, పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల సంఖ్యను బట్టీ ఆయా పాఠశాలల వార్డెన్లు నెలకు ఒక్కొ విద్యార్థిపై రూ.20చొప్పున ఆయా శాఖ అధికారులకు నెలవారీ మాముళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పాఠశాలలపై పర్యవేక్షణ ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులకు డెప్యుటేషన్‌లకు అవకాశం కల్పించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఏర్పడి గిరిజన విద్యార్థుల చదువులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గతంలోనూ ఈశాఖ అధికారులపై అనేక ఆరోపణలు వెలుగుచూశాయి. అవి ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.
నిఘా పెడతాం..
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచుతున్నాం. పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయిస్తున్న పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెడతాం.
-అన్నదొర, డీడీ, గిరిజన సంక్షేమశాఖ