Share News

అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా?

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:53 AM

రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కనిపించడం లేదా.. అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు.

అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా?

విజయనగరం రూరల్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కనిపించడం లేదా.. అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పై బొత్స చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని ఆక్షేపించారు. మేనిఫెస్టో ప్రకారం ఇప్పటికే 80శాతం హామీలు అమలు చేసిన ఘనత టీడీపీదేనన్నారు. రూ.4వేల పింఛన్‌ కనిపించలేదా.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కింద లబ్ధిదారుల ఖాతా ల్లో డబ్బులు జమ కావడం వాస్తవం కాదా.. గతంలో వైసీపీ నిలిపివేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించిన సంగతి తేలీదా.. అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా అమలు చేశామన్నారు. ఇవన్నీ వైసీపీ నాయకులకు తెలియదా.. అంటూ నాగార్జున బొత్స వ్యాఖ్యలను తప్పుపట్టారు. శాంతిభద్రతలు బాగోలేవంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదన్నారు. ఉపాధ్యా యుల యూనియన్ల ఫోన్లు ట్యాప్‌ చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. ఓ డాక్టరు మాస్క్‌ అడిగితే, ఆయన మరణానికి వైసీపీ కారణం కాదా? ఓ ఎమ్మెల్సీ.. డ్రైవర్‌ని చంపేసి డోర్‌ డెలివరీ చేసిన ఘనత కూడా వైసీపీదేనని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, ప్రసాదుల ప్రసాద్‌, కంది మురళీనాయుడు, ముద్డాడ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:53 AM