గిరిజన విద్యాలయాలపై పర్యవేక్షణ ఏదీ?
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:59 PM
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాలపై పర్యవేక్షణ కొరవడుతోంది.
- ఖాళీగా ఏటీడబ్ల్యూవో పోస్టులు
- తప్పని పాలనాపరమైన ఇబ్బందులు
- పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్ల కొరత
- పట్టించుకోని అధికారులు
- అవస్థలు పడుతున్న విద్యార్థులు
సీతంపేట రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. సహాయ గిరిజన సంక్షేమాధికారులు(ఏటీడబ్ల్యూవో), వార్డెన్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మెనూ అమలు, డైట్, బిల్లులు సరిచూసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, సర్వీస్ క్రమబద్ధీకరణ, ట్రెజరీకి బిల్లులు పంపించడం, నకిలీ ధ్రువపత్రా లపై విచారణ, విద్యార్థుల ఫేస్ రికగ్ననేషన్(ఎఫ్‌ఆర్‌ఎస్)అమలు వంటి కీలకమైన బాధ్యతలను ఏటీడబ్ల్యూవోలు నిర్వహించాల్సి ఉంది. కానీ, సీతంపేట ఐటీడీఏ పరిధిలో రెండు చోట్ల ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదే విధంగా 18 పోస్టుమెట్రిక్ వసతి గృహాలకు గాను పది మంది వార్డెన్లు మాత్రమే ఉన్నారు. దీంతో సమస్యలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు, 18 పోస్టుమెట్రిక్ వసతిగృహాలు, 12 గురుకులాల పరిధిలో సుమారు 16వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. అయితే, సీతంపేట, మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవోల పోస్టులు గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్నాయి. సీతంపేట ఏటీడబ్ల్యూవోగా పనిచేసిన జి.మంగవేణి ఇటీవలే అనకాపల్లి డీఎస్‌టీబ్ల్యూ అండ్ ఈవోగా బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఈ బాధ్యతలను డీడీ అన్నదొర నిర్వహిస్తున్నారు. అలాగే, మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవోగా పనిచేసిన కృష్ణవేణి కూడా కొద్ది రోజుల కిందట పార్వతీపురం డీడీగా డెప్యుటేషన్‌పై వెళ్లారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆమె సాలూరుకు బదిలీ అయ్యారు. మెళియాపుట్టి రెగ్యులర్ ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీగా ఉండడంతో లాబర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా మందస ఏటీడబ్ల్యూవో ఎం.శ్రీనివాసరావు బదిలీపై అల్లూరి జిల్లా అనంతగిరికి వెళ్లారు. అయితే, పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు మందసకు బదిలీపై వచ్చారు. ఈయన కూడా ఇక్కడ నుంచి అనంతగిరికి డెప్యుటేషన్‌పై వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. దీనికి ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆయన మందసలోనే పనిచేస్తున్నారు. రిలీవర్ రాకుండా ఏ శాఖలో కూడా ఉద్యోగులు బదిలీపై వెళ్లకూడదని ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో నిబంధన పెట్టింది. అయినప్పటికీ ఐటీడీఏ అధికారులు పట్టించుకోకుండా రిలీవర్‌లు రాకుండానే సీతంపేట, మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవోలను బదిలీ చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పర్యవేక్షణ లోపం..
సీతంపేట, మెళియాపుట్టిలో ఏటీడబ్ల్యూవో పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. మెనూ అమలులో లోపాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పని చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సరిపడా భోజనాలు పెట్టకపోవడంతో అర్ధాకలితో చిన్నారులు అలమటిస్తున్నారు. మెనూ అమలులో భాగంగా వారంలో రెండు రోజులు చికెన్ కర్రీని ఒక్కో విద్యార్థికి 100 గ్రాములకు తగ్గకుండా వడ్డించాలి. కానీ, 30 గ్రాములకు(రెండు ముక్కలు) మించి పెట్టడం లేదు. ప్రస్తుతం చాలా గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. సిక్‌రూమ్‌ల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు మలేరియా, వైరల్ జ్వరాలతో మూలుగుతున్నారు. కొన్ని రోజుల కిందట సీతంపేట ఏపీఆర్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పాముకాటుకు గురై ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఇలా గిరిజన పాఠశాలలపై రెగ్యులర్ సహాయ గిరిజన సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వేధిస్తున్న వార్డెన్ల కొరత
సీతంపేట ఐటీడీఏ పరిఽధిలోని పోస్టుమెట్రిక్ వసతిగృహాలను వార్డెన్ల కొరత వేధిస్తోంది. ఐటీడీఏ పరిధిలోని 18 పోస్టుమెట్రిక్ వసతి గృహాల్లో సుమారు 2,740 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. 18 హాస్టళ్లకు పది మంది మాత్రమే రెగ్యులర్ వార్డెన్లు ఉన్నారు. మిగిలిన ఎనిమిది హాస్టళ్లకు వార్డెన్‌ల కొరత వెంటాడుతోంది. మందస, పాతపట్నం, శ్రీకాకుళం, మెళియాపుట్టి, టెక్కలి, పలాస, కొత్తూరు తదితర వసతిగృహాల్లో రెగ్యులర్ వార్డెన్లు లేరు. ఇతర వసతిగృహాల వార్డెన్లకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. రెండేసి హాస్టళ్ల పర్యవేక్షణ తలకుమించిన భారం కావడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వార్డెన్ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వానికి నివేదించాం
సీతంపేట, మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవో పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదించాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలలపై పర్యవేక్షణ ఉంచాం. పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో రెగ్యులర్ వార్డెన్‌ల నియామకం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపాం. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
-అన్నాదొర, గిరిజనసంక్షేమ ఉపసంచాలకులు, సీతంపేట