పెట్రోల్ బంకులపై పర్యవేక్షణేదీ?
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:51 PM
ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో గోల్‌మాల్ జరుగుతోంది. కొన్ని బంకుల్లో కల్తీ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల మిషన్ ట్యాంపరింగ్ చేసి విక్రయాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
- ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా మోసాలు
- ట్యాంపరింగ్‌తో తక్కువగా వస్తున్న చమురు
- కల్తీతో దెబ్బతింటున్న వాహనాలు
- నిబంధనలను గొలికొదిలేసిన నిర్వాహకులు
- తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు
- రాజాంలోని ఓ పెట్రోల్ బంక్‌లో శివ అనే యువకుడు తన బైక్‌కు పెట్రోల్ కొట్టించాడు. గతంలో లీటరు పెట్రోల్ 50 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగా..ఈ సారి అది 30 కిలోమీటర్ల ఇచ్చింది. దీంతో ఆందోళనతో మెకానిక్‌ను ఆశ్రయించాడు. పెట్రోల్ కల్తీ మూలంగానే మైలేజీ తగ్గిందని మెకానిక్ చెప్పాడు. దీంతో షాక్ తినడం శివ వంతైంది.
- శ్రీనివాసరావు అనే యువకుడు పార్వతీపురం గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. సుదూర ప్రాంత ప్రయాణం కావడంతో రాజాంలోని ఓ పెట్రోల్ బంక్‌లో రూ.300 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. కానీ, 100 కిలోమీటర్ల ప్రయాణంలోనే బైక్ ఆగిపోయింది. దీంతో పెట్రోల్ వేయడంలో ట్యాంపరింగ్ జరిగిందని తెలుసుకొని బంక్ సిబ్బందిని అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
రాజాం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో గోల్‌మాల్ జరుగుతోంది. కొన్ని బంకుల్లో కల్తీ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల మిషన్ ట్యాంపరింగ్ చేసి విక్రయాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనీస నిబంధనలు పాటించడం లేదు. బంకుల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 180 వరకూ పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఎలక్ర్టికల్ వేయింగ్ మిషన్లలో ట్యాంపరింగ్ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100, 200 మిల్లీ లీటర్ల వరకూ పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించాలి. ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నిత్యం పెట్రోల్, డీజిల్ పెరుగుదలతో వినియోగదారులు కూడా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి పెట్రోల్ నాణ్యత తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్ పేపర్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్ వేస్తే అది ఆవిరి అయిపోతే అది నాణ్యమైన పెట్రోల్. మరకలుగా మిగిలిపోతే అది కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. ఈ విషయం చాలామంది వినియోగదారులకు తెలియదు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.110కు చేరింది. డిజీల్ రూ.100కు పైగా ఉంది. బంకులు అందుబాటులో లేనిచోట లూజు విక్రయాల పేరిట భారీ దోపిడీ జరుగుతోంది. లీటరు పెట్రోల్‌ను రూ.120కుపైగా విక్రయిస్తున్నారు. పైగా కల్తీ చేసి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో వాహనాలు పాడవుతున్నాయి.
మూడేళ్లలో 123 కేసులు..
గత మూడేళ్లలో అక్రమాలకు పాల్పడిన 123 మంది పెట్రోల్ బంకు నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదు చేశారు. గత మూడు నెలల్లో 45 చోట్ల తనిఖీలు చేయగా.. 10 చోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. జరిమానా రూపంలో రూ.2.33 లక్షలు వసూలు చేశారు. గత ఆరు నెలల కాలంలో 214 తనిఖీలు జరపగా..29 కేసులు నమోదుచేశారు. రూ.3.39 లక్షలు జరిమానా వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కానరాని సౌకర్యాలు..
పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే వాహనదారుల కోసం బంకుల వద్ద కొన్ని సౌకర్యాలు ఉండాలి. కానీ, చాలాచోట్ల ఆ సదుపాయాలు లేవు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించడంలేదు. మరుగుదొడ్లు ఉన్నా తాళాలు వేసి ఉంచుతున్నారు. కేవలం సిబ్బంది సొంత అవసరాలకే వాటిని వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌లో నాణ్యత కొరవడితే ఏ అధికారికి ఫిర్యాదుచేయాలి? ఎవర్ని సంప్రదించాలి? అనేది వివరాలతో సహా పొందుపరచాలి. కానీ, కొద్ది బంకుల్లోనే వీటిని పొందుపరుస్తున్నారు. వాస్తవానికి తమ పరిధిలో ఉండే బంకులను తూనికలు కొలతల శాఖ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది నిత్యం తనిఖీ చేయాలి. సంబంధిత ఆయిల్ కంపెనీ ప్రతినిధి సైతం సందర్శిస్తుండాలి. కానీ, జిల్లాలో అవెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అందుకే బంకు యాజమాన్యాలు కల్తీతో పాటు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
తనిఖీలు చేస్తున్నాం..
పెట్రోల్ బంకుల్లో కల్తీ చేసినా, కొలతల్లో మోసానికి పాల్పడినా చర్యలు తప్పవు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న బంకులన్నీ పౌరసరఫరాలు, తూనికల, కొలతల శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. రెండు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. మాదృష్టికి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా మోసాలు జరిగితే వెంటనే ఫిర్యాదుచేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
-రంగారెడ్డి, తూనికలు, కొలతల శాఖ అధికారి, ఉమ్మడి విజయనగరం