Is there a shortage of fertilizer? ఎరువు కొరత ఉందా?
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:56 PM
Is there a shortage of fertilizer? యూరియా కోసం బారులు.. గంటలకొద్దీ నిరీక్షణలు.. ఘర్షణలు.. వాగ్వాదాలు.. గొడవలు. జిల్లాలో కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇవే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏ రైతును కదిపినా ఒకటే మాట. యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఎరువు కొరత ఉందా?
అగాహన లోపమంటున్న అధికారులు
అవసరానికి మించి వాడొద్దని సూచనలు
వాణిజ్య పంటలకూ మళ్లిస్తున్న కొందరు
బస్తా యూరియాపై ప్రభుత్వ సబ్సిడీ రూ.1967
రూ.266కే రైతులకు అందజేత
మెంటాడ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):
యూరియా కోసం బారులు.. గంటలకొద్దీ నిరీక్షణలు.. ఘర్షణలు.. వాగ్వాదాలు.. గొడవలు. జిల్లాలో కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇవే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏ రైతును కదిపినా ఒకటే మాట. యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా అంత కొరత ఉందా? అంటే లేనే లేదని అధికారులు చెబుతున్నారు. ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన లోపముందని, అదే సమయంలో అమాయకత్వం కూడా ఉందనేది అధికారుల మాట. మిగిలిన ఎరువుల కన్నా ప్రభుత్వ సబ్సిడీ ఉండడం, తక్కువ ధరకు లభ్యమవడంతో రైతులు యూరియాపైనే దృష్టి పెట్టడం ఇంకో కారణంగా పేర్కొంటున్నారు. కాగా రెండు విడతలుగా ప్రభుత్వం కావలసినంత ఎరువు సరఫరా చేస్తున్నా మలివిడతలో దొరుకుతుందో లేదో అనే సంశయంతో కొందరు రైతులు రెండు విడతల ఎరువును ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు వాస్తవాలు వివరించి వారికి దైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులు ఆ బాధ్యతలను విస్మరించి రైతుల ఆందోళనతో రాజకీయం చేస్తున్నారు.
- 120 రోజుల కాలపరిమితి గల వరిపంటకు 60రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు పర్యాయాలు చొప్పున ఎకరాకు 40 కిలోల యూరియా వేయాల్సి ఉంటుంది. ఐతే కొందరు రైతులు మలివిడత నాటికి ఎరువు లభిస్తుందో లేదోనన్న భయంతో మొత్తం రెండు విడతలకు కలిపి ఒకేసారి కొనుగోలు చేస్తుండడం వల్ల తొలివిడతలోనే కొరత కనిపిస్తోంది. అంతేకాకుండా కొందరు రైతులు యూరియా ఎంత ఎక్కువ వేస్తే దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్న అమాయకత్వంతో ఎకరాకు రెండు విడతల్లో వేయాల్సిన 40 కిలోలను తొలి విడతకే వేసేస్తున్నారు.
- ప్రభుత్వ సబ్సిడీ ఎక్కువగా ఉండడం కూడా యూరియా వైపు మొగ్గు చూపడానికి కారణమవుతోంది. అసలు ధర రూ.2234 కాగా రూ.1967 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ కేవలం రూ.266కు సరఫరా చేస్తోంది. డీఏపీ అసలు ధర 2740 కాగా ప్రభుత్వ సబ్సిడీ రూ.1390 పోను రూ.1350 చొప్పున విక్రయాలు జరుగుతుంటాయి. అతి తక్కువ ధరకు సరఫరా కావడం యూరియా వాడకానికి మరో కారణంగా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
- అలాగే యూరియాను వరితోపాటు పామాయిల్, అరటి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలకు కూడా కొందరు మళ్లిస్తున్నారు.
మెంటాడలో కొరత లేదు
మెంటాడ మండలంలోని పరిస్థితులు పరిశీలిస్తే అసలు యూరియా కొరత లేనేలేదని స్పష్టమవుతోంది. ఈ మండలంలో వరిసాగు వరిసాగు విస్తీర్ణం 7664 ఎకరాలు. ఎకరాకు వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో ఎకరాకు 40 కిలోల యూరియా చొప్పున మొత్తం 7664 ఎకరాలకు 3 లక్షల 6వేల 560 కిలోల యూరియా అవసరం. ఈ సీజన్లో ఇప్పటివరకు 700 టన్నులు అంటే 7లక్షల కిలోల యూరియా సరఫరా చేశారు. అంటే డిమాండ్ కన్నా రెట్టింపు యూరియా రైతులకు అందించారు. అయినా కొరత అంటూ రైతులు గగ్గోలు పెట్టడంపై వ్యవసాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రెండు, మూడు విడతలది ఒకేసారి కొని నిల్వ చేసుకుంటున్నవారు కొందరైతే, ఇతర వాణిజ్యపంటలకు కూడా వాడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
- జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగానే యూరియా ‘కొరత’ అంశం కుదిపేస్తోంది. రైతుసేవా కేంద్రాలు, పీఎసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్లు ఇలా అన్ని చోట్లా అవసరం మేరకు సరఫరా జరిగినా ఆందోళనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ఇదేమాట పదేపదే చెబుతున్నారు.
అవగాహనలోపమే అసలు కారణం
ఎరువుల వినియోగంపై రైతుల్లో అవగాహన లోపమే అనేక సమస్యలకు కారణం.యూరియా కొరత కూడా అటువంటిదే.నిజానికి మెంటాడ మండలంలో డిమాండ్‌కు మించి యూరియా సరఫరా జరిగింది. కొందరు వాణిజ్య పంటలకూ వాడుతున్నారు. ఎరువులు అతి వాడకం వల్ల పంటలకూ నష్టమే. పలురకాల తెగుళ్లబారిన పడి ఆర్థికంగా నష్టపోవాల్సిఉంటుంది. పాము పొడ, అగ్గితెగులుతో పాటు లద్దే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లి కోడు, దోమపోటుతో వరి పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి తగ్గుతుంది.
గోకుల కృష్ణ, మండల వ్యవసాయాధికారి, మెంటాడ
మొక్కజొన్నకూ వాడుతున్నాం
యూరియాను వరి, మొక్కజొన్న పంటలకూ వాడుతున్నాం. అధిక దిగుబడి వస్తుందని చెప్తే తీసుకుంటున్నాం. పంటకు చీడపీడలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇకపై జాగ్రత్తగా ఉంటాం.
ఎస్.శ్రీనివాసరావు, రైతు, కొండలింగాలవలస గ్రామం
------------------------