Is it water for cultivation? శివారు ఆయకట్టుకు నీరందేనా?
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:13 AM
Is it water for cultivation?

శివారు ఆయకట్టుకు నీరందేనా?
దయనీయంగా మడ్డువలస రిజర్వాయర్
పటిష్టంగా లేని గేట్లు, కాలువల గట్లు
నిరాశలో రైతులు
రేపు నీరు విడుదలకు అధికారుల సన్నాహాలు
మడ్డువలస జలాశయానికి పూర్వవైభవం వస్తుందా? 30వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా? గేట్లు బాగు చేస్తారా? నిర్వహణ గాడిన పడుతుందా? జలాశయం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తారా? ఈ ప్రశ్నలకు రైతుల నుంచి సందేహంతో కూడిన సమాధానం వస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో అన్నదాతలు నమ్మకం కోల్పోయారు. నేతలు, అధికారుల హామీలను గాలి మాటలుగా పేర్కొంటున్నారు.
వంగర, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పేరొందిన మడ్డువలస జలాశయంలో సాగునీరు పుస్కలంగా ఉన్నా శివారు పంట భూములకు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. జలాశయం కనీస స్థాయిలో నిర్వహణకు నోచుకోవడం లేదు. గేట్లు దెబ్బతిని నీరు నిత్యం వృథాగా నాగావళిలో కలిసిపోతోంది. ఎడమకాలువ ఎనిమిది సంవత్సరాలుగా పటిష్టంగా లేదు. దీనివల్ల నీటి లీకేజీలతో పక్కనున్న పంట పొలాలు తంపర భూములుగా మారుతున్నాయి. వాటిలో ఏ పంట వేసినా దిగుబడి ఆశాజనకంగా లేదు. జలాశయం వద్ద విద్యుత్ దీపాలు లేవు. ప్రాజెక్టు ఇంత దయనీయంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, 37 వేల ఎకరాలకు నీరు అందిస్తామని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జగన్ పాదయాత్రలో హామీలిచ్చారు. ఒక్కటీ ఆచరించలేదు. మరోవైపు మడ్డువలస రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా ఈ నెల 7న ఖరీఫ్ పంటలకు నీరు విడుదల చేయటానికి అధికారులు సన్నాహాలు చేశారు. ఈ ఏడాది ఆయకట్టు మొత్తం 30077 ఎకరాలకు నీరు అందిస్తామని అంటున్నారు. ఇలాంటి ప్రకటనలు ఎన్నో విన్నామని రైతులు విమర్శిస్తున్నారు.
మడ్డువలస రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా వంగర మండలంలో 996, రేగిడిలో 6777, సంతకవిటిలో 10976, జి.సిగడాంలో 6029, పొందూరు వద్ద 99వ స్టేజ్-1 ద్వారా 24877 ఎకరాలకు.. స్టేజ్-2 ద్వారా లావేరులో 5200 కలుపుకుని మొత్తం 30077 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. సగం ఆయకట్టుకు కూడా పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని రైతులంటున్నారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 65 మీటర్లు కాగా 64 మీటర్ల స్థిరీకరణ ఉంది. అయితే నిర్వాసితుల సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయటంలేదని ఆధికారులు చెబుతున్నారు. కూడి ప్రధాన కాలువ ద్వారా 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే తప్పా శివారు భూములకు నీరు అందదు. కాలువలు సహకరించడం లేదని అధికారులే చెబుతున్నారు. స్పిల్ వేపై 11 గేట్లు ఉండగా కొన్ని దెబ్బతిన్నాయి. వాటికి సరిగా మరమ్మతులు చేయక నిత్యం నీరు వృథాగా నాగావళికి పోతోంది. రెండో దశ కాలువల పనులు ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి.
పర్యవేక్షణ కరువు
ప్రస్తుతం జలాశయానికి ఉన్న 11 గేట్లలో 1,2,3,5,6,10,11 గేట్లుకు ఉన్న రబ్బరు సీల్లు దెబ్బతిన్నాయి. దీంతో నీరు వృథాగా పోతోంది. వీటి పరిస్థితిపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు వచ్చాయి. స్పందించిన ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసింది. ఆ సమయంలో రిజర్వాయర్‌లో నీరు మొత్తం ఖాళీ చేసి నామమాత్రంగా పనులు జరిపి విలువైన మత్స్య సంపదను దళారులకు కట్టబెట్టారు. సిబ్బంది ఏడుగురు విధుల్లో ఉండాలి. కేవలం ఒక్కరే ఉంటున్నారు. లష్కర్ల కొరతా ఉంది. కొన్నేళ్లుగా కొత్త వారిని నియమించడం లేదు. జలాశయం వద్ద విద్యుత్ దీపాలు వేయడం లేదు.
నిధులొస్తే పనులు చేపడ్తాం
నితిన్, ఏఈ, మడ్డువలస
కొన్నేళ్ల కిందట రెండవ దశ పనులు నిలిచిపోయాయి. అత్యవసర నిధుల మంజూరుతో కొన్ని పనులు చేపట్టాం. ఇటీవల గేట్లు, విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేశాం. నిధులు పూర్తిస్థాయిలో వస్తే పనులు చేపట్టి పూర్తి ఆయకట్టుకు నీరు అందిస్తాం. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 590 క్యూసెక్కులు వస్తుండగా 64 మీటర్లకు చేరింది. ఈ నెల 7న నీటి విడుదలకు సన్నాహాలు చేశాం.