Share News

రీ సర్వేతో ఇన్ని కష్టాలా?

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:50 PM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూముల రీ సర్వే రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. అప్పటి నుంచి అవస్థలు పడుతూనే ఉన్నారు.

రీ సర్వేతో ఇన్ని కష్టాలా?
కొత్తవలస: ఉమ్మడి ఎల్‌పీఎంతో ఉన్న భూములు

కొత్తవలస, జూలై 6(ఆంధ్రజ్యోతి):
రీసర్వే చిక్కుల నుంచి రైతులు బయట పడలేకపోతున్నారు. సుమారు వంద సంవత్సరాల తరువాత తామే భూములను రీసర్వే చేసి రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్తామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వ నేతలు చెప్పి రీసర్వే చేయించారు. ఆ తరువాత రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. సర్వే నంబర్ల నమోదు ప్రక్రియ ఓ పద్ధతిలో జరగలేదు. ఒక రైతు పేరిట ఉన్న సర్వేనెంబరును పక్కనే ఉన్న ఇద్దరి ముగ్గురి రైతుల సర్వేనెంబర్లతో కలిపి ఎల్‌పీఎం(ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌) పేరుతో ఒకే సర్వేనెంబరు ఇచ్చారు. దీంతో రైతులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వారినే కాకుండా ఇతరులతో కలిపి జాయింట్‌ ఎల్‌పీఎంలు ఇచ్చారు. దీనివల్ల ఒక సర్వేనెంబరులోని భూమిని విక్రయించుకోవాలన్నా ఎల్‌పీఎంలో ఉన్న భూమంతా రిజిస్ర్టేషన్‌ చేయాలంటున్నారు. లేకుంటే మళ్లీ సర్వే చేయించుకుని అమ్మదలచిన భూమికి కొత్త ఎల్‌పీఎం చేయించుకోవాలి. అంతే కాకుండా ఒక సర్వేనెంబరులో ఎకరం భూమి ఉంటే అందులో అర ఎకరం విక్రయించుకోవాలన్నా సాధ్యం కాదు. ఎకరం భూమిని సర్వే చేసుకుని తొలుత రెండు ఎల్‌పీఎంలుగా మార్చుకోవాలి. రీ సర్వే తర్వాత రైతులకు ఇన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.
2024 ఎన్నికలు సమీసిస్తుండడంతో రీసర్వే అధికారులపై అప్పటి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో వారు తప్పులు తడకలతో సర్వే చేసి మమ అనిపించారు. రాష్ట్రంలో ఏగ్రామంలో 1-బీ కాపీలను చూసినా తమకు భూమి ఎలా దఖలు పడిందనే కాలమ్‌లో అనువంశికం అనే ఉంటుంది తప్ప మరో కారణం లేదు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసుకున్నవారికి ఆ కాలమ్‌లో గతంలో క్రయం అని ఉండేది. ఇప్పుడు క్రయం అనే పదమే లేదు. దీనివల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిలో రీసర్వేను రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చినా...
కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ రీసర్వే ఆగిపోయిందో మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దడం కోసం మొదట్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సుల పేరుతో హడాహుడి చేశారు తప్ప పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. భూములను కొనుగోలు చేసుకున్నవారు 1-బీ కాపీలో అనువంశికానికి బదులు క్రయం అని మార్పు చేయాలంటే సర్వే నెంబరుకు రూ.50 చొప్పున చలానా కట్టాలని రెవెన్యూశాఖ చెబుతోంది. ఇక ఎల్‌పీఎంలను విడదీసుకోవాలంటే జూన్‌ 30 వరకు రూ.50 చలానా కడితే సరిపోయేది. జూలై 1వ తేదీ నుంచి జాయింట్‌ ఎల్‌పీఎంలను విడదీసుకోవాలంటే ఒక్కో నెంబరుకు రూ.550 చెల్లించాలి. ఆ ప్రభుత్వం తప్పు చేస్తే తమకా శిక్షా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం నాటి తప్పులను ఎలాంటి ఫీజు తీసుకోకుండా సరిదిద్దాలని కోరుతున్నారు.
చలానా చెల్లిస్తే వచ్చి సర్వే చేస్తారు..
భూములకు సంబంధించి జాయింట్‌ ఎల్‌పీఎంలను విడదీసుకోవడానికి జూలై 1వ తేదీ నుంచి ఫీజు పెరిగింది. ఒక్కో సర్వే నంబర్‌కు రూ.550 చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత గ్రామానికి సర్వేయర్‌, వీఆర్వో వచ్చి పరిశీలించి కొత్త ఎల్‌పీఎం ఇస్తారు. అలాగే 1-బీ కాపీలో అనువంశికానికి బదులు క్రయం అని మార్పు చేసుకోవాలంటే దస్తావేజులతో పాటు సర్వేనెంబరుకు రూ.50 చొప్పున చలానా చెల్లించాలి.

-తహసీల్దార్‌ అప్పలరాజు

Updated Date - Jul 06 , 2025 | 11:50 PM