Share News

ప్రయాణికులకు భద్రతేదీ?

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:06 AM

: ఒడిశా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది.

ప్రయాణికులకు భద్రతేదీ?
పూర్తిగా కాలిపోయిన ఒడిశా ఆర్టీసీ బస్సు

- కాలం చెల్లిన బస్సులను తిప్పుతున్న ఒడిశా ఆర్టీసీ

- జిల్లా మీదుగా రాకపోకలు

- ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన

- జిల్లా ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టాలంటున్న ప్రయాణికులు

పార్వతీపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒడిశా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఆ రాష్ట్ర ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను ఎక్కువగా నడుపుతుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈ సర్వీసులు అధికంగా రాకపోకలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం విజయనగరం నుంచి వొమ్మరకోటకు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద దగ్ధమైంది. ఆంధ్రా-ఒడిశా ఘాట్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే, డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఒడిశా ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణం భద్రమేనా? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

ఒడిశా ఆర్టీసీకి చెందిన వివిధ బస్సులు ప్రతిరోజూ జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిశాలోని జైపూర్‌, రాయఘడ, తదితర ప్రాంతాల నుంచి బయలుదేరి సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల మీదుగా విజయనగరం, విశాఖపట్నంతో పాటు పర్లాకిమిడి ప్రాంతాలకు సాధారణ, ఎక్స్‌ పెస్‌ సర్వీసులు నడుస్తుంటాయి. ఒడిశాలోని జైపూర్‌, కొరాపుట్‌, సిమిలిగూడ, రాయగఢ, జేకేపూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఒడిశా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇందులో చాలా బస్సులు పాతవి కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల మీదుగా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. ఆయా డిపోల పరిధిలో ప్రతిరోజూ 200మందికి పైగా ప్రయాణికులు ఒడిశా-ఆంధ్రాకు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఈ బస్సుల్లో ప్రయాణికులకు భద్రత తక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. జైపూర్‌ నుంచి సాలూరు వరకు ఆ బస్సులు ఏ విధంగా వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఒడిశా ఆర్టీసీ ఇటీవల కొత్తగా ప్రారంభించిన సర్వీసులు మినహా పాత సర్వీసులకు సంబంధించి కొన్ని బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఘాట్‌ రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌..

ఆంధ్రా-ఒడిశా ఘాట్‌ రోడ్డులో ఏదైనా ప్రమాదం జరిగితే గంటల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. సాలూరు నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఘాట్‌ రోడ్డు ఉంది. ఒడిశా బస్సులతో పాటు ఆంధ్రా బస్సులు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. భువనేశ్వర్‌ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ఉంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అతివేగంతో ఘాట్‌ రోడ్డు వద్ద బస్సులు ప్రమాదాలకు గురవుతుంటాయి. దీంతో ఒక్కొక్కసారి సుమారు ఐదు, ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. ఈ సమయంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఒడిశా బస్సులపై జిల్లా రవాణాశాఖాధికారులు దృష్టి కేంద్రీకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తనిఖీలు చేస్తున్నాం

ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లా మీదుగా వెళ్లే బస్సులను ప్రతిరోజూ తనిఖీలు చేస్తున్నాం. రొడ్డవలస వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి 2020-2021కు చెందిన బస్సు డ్రైవర్‌ అ ప్రమత్తంగా ఉండడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

- దుర్గా ప్రసాద్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి

Updated Date - Nov 07 , 2025 | 12:06 AM