Is it 'safe'? సు‘రక్షిత’మేనా?
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:37 PM
Is it 'safe'? ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. కానీ ఏడాదికి రెండుసార్లు కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలి. వర్షాకాలంలో మాత్రమే అదీ మొక్కుబడిగా చేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి లోపాలను సవరించాలి. ఈ ప్రక్రియ కూడా అంతంతమాత్రమే. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ట్యాంకుల తీరును పర్యవేక్షించాలి. ఎక్కడా జరగడం లేదు. వెరసి ప్రజలకు అపరిశుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది.
సు‘రక్షిత’మేనా?
అపరిశుభ్రంగా తాగునీటి ట్యాంకులు
క్రమ తప్పకుండా శుభ్రం చేయని సిబ్బంది
కానరాని క్లోరినేషన్
పరిశీలించని అధికారులు
ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. కానీ ఏడాదికి రెండుసార్లు కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలి. వర్షాకాలంలో మాత్రమే అదీ మొక్కుబడిగా చేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి లోపాలను సవరించాలి. ఈ ప్రక్రియ కూడా అంతంతమాత్రమే. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ట్యాంకుల తీరును పర్యవేక్షించాలి. ఎక్కడా జరగడం లేదు. వెరసి ప్రజలకు అపరిశుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది.
రాజాం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలా గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయడం లేదు. ఏదైనా జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం తప్ప పర్యవేక్షణ లేదు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ రక్షిత నీరు అందించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ దశాబ్దాల కిందట నిర్మించిన ట్యాంకులను పట్టించుకోవడం లేదు. కనీసం శుభ్రం చేయడం లేదు. కొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఫలితంగా ఆ నీరు తాగుతున్న లక్షల మంది ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 41 సమగ్ర మంచినీటి పథకాలు ఉన్నాయి. 1621 గ్రామాల్లో 1100కుపైగా సాధారణ పథకాలున్నాయి. వీటిపై 17 లక్షల మంది జనాభా ఆధారపడుతున్నారు. ఇందులో సీపీడబ్ల్యూఎస్ 30, పీడబ్ల్యూఎస్ 934, ఎంపీడబ్ల్యుఎస్ 185, డైరెక్ట్ పంపింగ్ 408 పథకాలు ఉన్నాయి. ఇక చేతి పంపులు 15,468 కొనసాగుతున్నాయి. అయితే అందులో సగం ట్యాంకులు మెట్లు, నిచ్చెనలు పాడయ్యాయి. లీకులకు గురవుతున్నాయి. ట్యాంకులపై మొక్కలు మొలచి, పక్షులు మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. దీంతో తాగునీరు ఎంతోకొంత పాడవుతోంది. అధికారుల్లో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ప్రజారోగ్యానికి విఘాతంగా మారవచ్చు.
ఇవేవీ కానరావు
వాటర్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. ఏడాదికి రెండుసార్లు కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కాలాలతో సంబంధం లేకుండా క్లోరినేషన్ చేయాలి. కేవలం వర్షాకాంలో మాత్రమే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు పర్యవేక్షించాలి. ఇదీ జరగడం లేదు. వర్షాకాలంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటిని కాచి వడబోసి తాగాలని అధికారులు అవగాహన కల్పించాలి. ఆ పరిస్థితే లేదు. ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి లోపాలను సవరించాలి. పైపులైన్లు మరమ్మతులకు గురైతే వెంటనే బాగుచేసే ఏర్పాట్లు చేయాలి. జిల్లాలో అటువంటి పరిస్థితేదీ కనిపించడం లేదు. మరోవైపు చాలాచోట్ల కాలువల్లోనే పైపులైన్లు ఉన్నాయి. వాటిని మార్చడం లేదు. నెలల తరబడి శుభ్రం చేయక ట్యాంకర్ల నుంచి దుర్వాసన వస్తోంది. ఊటబావుల నుంచి వచ్చే నీటిని క్లోరినేషన్ చేపట్టకుండా నేరుగా రక్షిత నీటి పథకాలకు తరలించి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గత ఏడాది తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా ప్రబలిందని యంత్రాంగమే చెప్పింది కానీ పరిష్కార మార్గాలు చూపలేదు. క్లోరినేషన్ అన్న మాటనే మరిచిపోయారు.
బాధ్యత మీదంటే మీదే..
తాగునీటి ట్యాంకుల నిర్వహణ విషయానికి వచ్చేసరికి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్వహణ మీదంటే మీదేనంటూ ఒకరిపై ఒకరు నెపం వేస్తున్నారు. రక్షిత నీటి ట్యాంకులను విధిగా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. అయితే ఎక్కడా శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ట్యాంకులపై పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నాయి.
సత్వరం చర్యలు తీసుకుంటాం
రక్షిత నీటి పథకాలకు సంబంధించి క్లోరినేషన్ చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విషయంలో స్థానిక సంస్థలు సైతం బాధ్యత తీసుకోవాలి. మండలాల్లో పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలదే. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. సత్వర పరిష్కార మార్గం చూపిస్తాం.
- కవిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, విజయనగరం